Vaazha Review : పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం | Vaazha : Biopic of a Billion Boys Review In Telugu | Sakshi
Sakshi News home page

Vaazha Review : పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం

Published Wed, Jan 8 2025 1:16 PM | Last Updated on Wed, Jan 8 2025 1:26 PM

Vaazha : Biopic of a Billion Boys Review In Telugu

ఈ సినిమా తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్ళో, ఊళ్ళో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కాని తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే.  పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునే వారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికిరారని మరికొందరు వారి యవ్వన దశను వారిగనుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాఝా(Vaazha : Biopic of a Billion Boys). బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అన్నది దీని టాగ్ లైన్.

ఈ టాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజజీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్(Basil Joseph) ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది.

ఈ నలుగురు స్కూలు, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు. కాని ఆ ఫెయిలయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాక తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం మీరు ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి కాని తమ ఆలోచనలను వాళ్ళ మీద రుద్ద కూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. 

సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియస్ దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కాని కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ వాఝా... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌  హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. మస్ట్ వాచ్.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement