'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ) | Vaazha Movie Review In Telugu And OTT Details | Sakshi
Sakshi News home page

Vaazha Review: 'వాళా' సినిమా రివ్యూ

Published Tue, Sep 24 2024 3:37 PM | Last Updated on Tue, Sep 24 2024 8:50 PM

Vaazha Movie Review In Telugu And OTT Details

ఓటీటీలో ప్రతివారం పదులకొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మలయాళ సినిమా 'వాళా'. కేవలం రూ.4 కోట్లు పెట్టి తీస్తే రూ.40 కోట్లు వసూలు చేసిందీ చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలామ్, వివేక్ ఆనంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీళ్లంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటిరోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్‌ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్లు.. ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్లు బయటపడ్డారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

ఎలా ఉందంటే?
కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది మరి. చదువు బిడ్డల సంగతి పక్కనబెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్‌లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కథే 'వాళా'. చూస్తే సింపుల్ కథనే గానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రులు మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.

కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కుర్రాళ్ల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాళ్ల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్లు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90స్ జ్ఞాపకాల్ని నెమరవేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివర అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం.

'వాళా' అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనిపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కని చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా.. అరటి తోటని చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతోమంది కుర్రాళ్లు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయ్.

ఎవరెలా చేశారు?
యాక్టర్స్ ఎవరూ మనకు తెలియదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లు ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషం చూడటం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. నిడివి కూడా 2 గంటలే. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది.

-చందు డొంకాన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement