తమిళసినిమా: దక్షిణాదిలో సంచలన నటిగా ముద్రవేసుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి పాత్రనైనా, ఏ భాషలోనైనా నటించి సత్తా చాటగలిగిన నటి ఈ భామ. నటుడు శరత్‌కుమార్ వారసురాలైన వరలక్ష్మి నిజానికి 18 ఏళ్ల వయసులోనే కథానాయకిగా సినీ రంగప్రవేశం చేయాల్సిందట. ఈ సమయంలో శంకర్ దర్శకత్వంలో బాయ్స్, కాదల్ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశాలు రాగా చాలా చిన్న వయసు ఇప్పుడే సినిమాలు వద్దు అని తండ్రి శరత్‌కుమార్ హితబోధ చేశారట. దీని గురించి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
2012లో ధనుష్ హీరో నటించిన పోడాపోడీ చిత్రం ద్వారా ఈమె కథానాయకిగా తెరంగేట్రం చేశారు. ఆ విధంగా నటిగా పుష్కరకాలం పూర్తి చేసుకున్నారు. విగ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో వరలక్ష్మికి వెంటనే అవకాశాలు రాలేదు. దీంతో తెలుగు, కన్నడం భాషల్లో దృష్టి సారించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటిగా నిరూపించుకున్నారు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో నాయకిగా నటించే అవకాశం రావడం, ఆ చిత్రంలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అయినప్పుటికీ కథానాయకిగానే నటించకుండా, ప్రతినాయకి పాత్రల్లోనూ నటిస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు.
ఈమెకు ఇప్పుడు 38 ఏళ్లు. గత నెలలోనే వివాహ నిశ్చితార్థం జరిగింది. ముంబైకి చెందిన నిక్కోలాయ్ సచ్‌దేవ్‌తో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న ఈయనకిది రెండో పెళ్లి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. విశేషం ఏమిటంటే ఈయన వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు 14 ఏళ్లుగా స్నేహితుడట. వరలక్ష్మి ఇంటర్వ్యూ పేర్కొంటూ తన సినిమా, వ్యక్తిగత జీవితం గానీ చేసుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదని చెప్పారు.
తాను పోడాపోడీ చిత్రంలో నటించినప్పుడు తన వయసు 22 ఏళ్లు అని, ఎలాగైనా 28 ఏళ్లలోపు స్టార్ నటిగా ఎదగాలని భావించానన్నారు. అదేవిధంగా 32 ఏళ్లలో పెళ్లి చేసుకుని 34 ఏళ్లలో పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నానని, అయితే తన వయసు ఇప్పుడు 38 ఏళ్లు అని పేర్కొన్నారు. అలా తన సినీ, వ్యక్తిగత జీవితాల్లో వేసుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదని అన్నారు. పోడాపోడీ చిత్రం తరువాత పర్సనల్ జీవితంపై ఎక్కువగా దృష్టి పెట్టానని, అదే తాను చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. అందువల్ల తన సినీ జీవితం బాధించిందన్నారు. అప్పుడే తాను సినిమాలపై దృష్టి సారించి ఉంటే ఎక్కువ చిత్రాలు చేసి ఉండేదానినని అన్నారు. అయితే అపజయాలే తనను దృఢపరిచాయని వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment