
‘తెలుగులో నేను చేసిన తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’. ఇది థ్రిల్లర్ మూవీ. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసింది? అనేది ఈ చిత్రకథ. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో డ్యాన్స్ చేశాను’’ అని వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదలవుతోంది.
ఐదు భాషల ట్రైలర్స్ విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు వరుణ్ సందేశ్ తెలుగు ట్రైలర్‌ని, నిర్మాత మహేంద్రనాథ్ తమిళ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ‘‘నిర్మాత గురించి ఆలోచించే నటి వరలక్ష్మి. ‘శబరి’ నా తొలి సినిమా. ఆదరించాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ఈ కార్యక్రమంలో నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.