ఇండియన్‌ 2 సినిమాకు విడుదల చిక్కులు | Varma Asan Rajendran Petition In The Madurai Court Regards Indian 2 Movie | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ 2 సినిమాకు విడుదల చిక్కులు

Published Sat, Jun 29 2024 5:56 PM | Last Updated on Wed, Jul 10 2024 3:38 PM

Varma Asan Rajendran Petition In The Madurai Court Regards Indian 2 Movie

అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్‌ను మరోసారి వెండితెరపై శంకర్‌ చూపించనున్నాడు. అయితే తాజాగా భారతీయుడు 2 చిత్రానికి విడుదల విషయంలో చిక్కులు ఏర్పడేలా కనిపిస్తున్నాయి.

భారతీయుడు సినిమాలో అవినీతిపరులను అంతం చేసేందుకు కమల్‌ హాసన్‌ తన రెండు వేళ్ల సాయంతో శత్రువుల మెడ భాగంపై సింపుల్‌గా నొక్కి హతమారుస్తాడు . భారతీయుడు సినిమా కోసం మర్మక్కలై (మర్మకళ) అనే విద్యకు సంబంధించిన కొన్ని ట్రిక్స్‌ను కమల్‌ నేర్చుకున్నారు. 1996 సమయంలోనే ఆ విద్యను రాజేంద్రన్ అనే వ్యక్తి నుంచి కమల్‌ నేర్చుకున్నారు. ఇప్పుడు భారతీయుడు 2 సినిమా కోసం తను నేర్పించిన విద్యనే వెండితెరపై చూపించబోతున్నారని, అందుకు సంబంధించి తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని  మదురై జిల్లా న్యాయస్థానంలో కాపీరైట్‌ కేసును రాజేంద్రన్ వేశారు. భారతీయుడు సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోర్టును కోరారు.

రాజేంద్రన్ తన పిటీషన్‌లో ఇలా పేర్కొన్నారు..' 1996 భారతీయుడు సినిమా సెట్‌లో కమల్‌హాసన్‌కు  వర్మక్కలై విద్యకు సంబంధించి కొన్ని ముద్రలు నేర్పించాను. కొన్ని ఫైట్‌ సీన్స్‌కు అవసరమైన విద్యను నా నుంచే నేర్చుకున్నారు. మర్మకళ కళలోని శాస్త్రీయ పద్ధతులను చిత్ర దర్శకుడు శంకర్‌తో పాటు రచయిత సుజాతకు వివరించాను. అలా భారతీయుడు-1 సినిమాలో పనిచేసిన వ్యక్తుల జాబితాలో నా పేరు కూడా ఉంది.

ఈ సందర్భంలో భారతీయుడు 2 సినిమా త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలలో నేను కమల్ హాసన్‌కి శిక్షణ ఇచ్చిన మర్మకళ ముద్రలను మళ్లీ ఉపయోగించారు. కానీ సినిమా టైటిల్ కార్డ్‌లో నా పేరు లేదు. ఇండియన్ సినిమా కోసం నా నుంచి ట్రైనింగ్ తీసుకున్న వర్మ ముద్రలనే ఇండియన్-2 సినిమాలో కూడా వాడారు కాబట్టి ఈ సినిమాలో కూడా నా పేరు ఎందుకు వేయలేదు. కాబట్టి ఈ సినిమా విడుదలను నిషేధించాలి.' అని పిటిషన్‌లో రాజేంద్రన్ పేర్కొన్నారు.

ఈ కేసు మదురై జిల్లా న్యాయమూర్తి సెల్వ మహేశ్వరి ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఇండియన్ 2 నిర్మాత సుభాస్కరణ్‌, దర్శకుడు శంకర్, నటుడు కమల్ హాసన్‌లకు కాపీరైట్ నోటీసులు పంపాలని ఆదేశిస్తూ విచారణను జూలై 9కి వాయిదా వేశారు. జూలై 12న భారతీయుడు సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement