అంతకంటే ఆనందం మరొకటి ఉండదు: వరుణ్‌ తేజ్‌ | Varun Tej About Matka Movie | Sakshi
Sakshi News home page

అంతకంటే ఆనందం మరొకటి ఉండదు: వరుణ్‌ తేజ్‌

Nov 10 2024 2:33 AM | Updated on Nov 10 2024 10:14 AM

Varun Tej About Matka Movie

‘‘బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్‌ వచ్చిన వాసు అనే ఒక అబ్బాయి జీవిత కథ ‘మట్కా’. 1958 నుంచి 1982 వరకు అంచలంచెలుగా వాసు ఎలా ఎదిగాడు? అనేది సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. ‘మట్కా’ సందేశాత్మక చిత్రం కాదు. పక్కా కమర్షియల్‌ మాస్‌ ఫిలిం’’అని హీరో వరుణ్‌ తేజ్‌ అన్నారు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా, మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మట్కా’. డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ పాన్‌ ఇండియా మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ పంచుకున్న విశేషాలు...  

కరుణ కుమార్‌గారు ‘మట్కా’ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేద్దామని భావించారు. తనే మట్కా కింగ్‌ అయి ఉంటే ఎలా చేసేవారో అని ఆలోచించి ఆయనకు వచ్చిన ఐడియాస్‌తో వాసు క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు. ఈ కథ చదువుతున్నప్పుడే వాసు పాత్ర ఎలా ఉంటుందో ఒక అంచనాకి వస్తాం. తనకి ఎవడూ సాయం చేయడనే ఒక బాధ, కోపం వాసులో కనిపిస్తుంది. పైగా ఈ దేశంలో చెలామణి అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు ఒక్క శాతం వారే సంపాదిస్తారు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. వాసు ఆ ఒక్క శాతంలో ఉండాలనుకుంటాడు. ఇందుకోసం తను ఏం చేశాడు? అన్నది సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. 

‘మట్కా’లో వాసు పాత్ర చాలా » లంగా ఉంటుంది. మంచీ, చెడు అని కాదు.. ప్రేక్షకులు థియేటర్స్‌లో కూర్చున్నప్పుడు ఒక క్యారెక్టర్‌తో కనెక్ట్‌ అవ్వాలి, ఆ పాత్రతో ప్రయాణించాలి. అలా చూసుకుంటే ‘మట్కా’ లో వాసు క్యారెక్టర్‌కి ఆడియన్స్ కనెక్ట్‌ అవుతారు.. రెండున్నర గంటలు వాసుతో పాటు ప్రయాణం చేస్తారు. మాస్‌ ఆడియన్స్ లక్ష్యంగా చేసిన సినిమా ఇది. కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఈ సినిమాలో సెకండ్‌ హాఫ్‌లో వాసు పాత్ర తన బాధని, అసలు తను ఎందుకు అలా అయ్యాడో కూతురుతో ఒక పిట్ట కథలా చెబుతున్నప్పుడు ప్రేక్షకుల కళ్ల నుంచి నీరు వస్తాయి. దాదాపు వారం పాటు ఆ సీన్, డైలాగ్స్‌ని చదువుతూనే ఉన్నాను. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే ఎగై్జట్‌మెంట్‌ ఉంది. 

నేను సోలో హీరోగా నటించిన లాస్ట్‌ మూడు సినిమాల్లో(గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్‌ వాలంటైన్‌) పెర్ఫార్మెన్స్ పరంగా కొంచెం లిమిటేషన్స్ ఉండే పాత్రలు చేశాను. ‘గద్దల కొండ గణేష్‌’ తర్వాత మళ్లీ అలాంటి నటనకి స్కోప్‌ ఉండే సినిమా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘మట్కా’ కథ వచ్చింది. ఇందులో వాసులాంటి పాత్ర చేయడం సవాల్‌గా, అదృష్టంగా అనిపిచింది. స్క్రీన్‌పై వరుణ్‌ అని కాకుండా ప్రేక్షకులు వాసునే చూడాలి. దాని కోసం కష్టపడాల్సిందే. ‘గద్దల కొండ గణేష్‌’ తర్వాత నేను బయటకి వెళ్లినప్పుడు వరుణ్‌ అని కాకుండా గణేష్‌ అని పిలిచారు. అది నాకు చాలా పెద్ద ప్రశంస. ఓ యాక్టర్‌గా నన్ను క్యారెక్టర్‌ పేరుతో పిలిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.  

కరుణ కుమార్‌గారు మంచి విజన్‌ ఉన్న డైరెక్టర్‌. గ్రౌండ్‌ రియాలిటీని షుగర్‌ కోటింగ్‌ లేకుండా చెబుతుంటారు.. అది నాకు చాలా నచ్చింది. ఆయనకి మ్యూజిక్‌ మీద కూడా మంచి కమాండ్‌ ఉంది. ‘మట్కా’ తో ఆయనకి ఇంకా మంచి పేరువస్తుంది. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. ఆ పాటలు కథలో చాలా ముఖ్యం. జీవీ ప్రకాష్‌ కుమార్‌ అద్భుతమైన సంగీతం, అదిరిపోయే నేపథ్య సంగీతం అందించారు. వాసుతో పాటు ట్రావెల్‌ అయ్యే క్యారెక్టర్‌ మీనాక్షీ చౌదరిది. నోరా ఫతేహి, కన్నడ కిషోర్, జాన్‌ విజయ్, రాజేష్, నవీన్‌ చంద్ర పాత్రలు కూడా చాలా బాగుంటాయి. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు తొలి రోజు నుంచి చాలా ప్యాషనేట్‌గా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement