‘‘నా కెరీర్‌లో రొమాంటిక్ ఫిల్మ్స్ హిట్స్‌గా నిలిచాయి. కానీ యాక్షన్ ఫిల్మ్స్ చేయడానికే ఇండస్ట్రీకి వచ్చాను. యాక్షన్ జానర్‌పై నాకున్న ఇష్టమే నన్ను ‘గని’ సినిమా చేసేలా ప్రేరేపించిందేమోనని అనుకుంటున్నాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు.
‘మిస్టర్’ (2017) సినిమా సమయంలో కిరణ్ కొర్రపాటితో మంచి పరిచయం ఏర్పడింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను హీరోగా చేసిన ‘తొలిప్రేమ’ (2018) సినిమాకు కిరణ్ కో డైరెక్టర్‌గా చేశాడు. అప్పుడు కిరణ్ నాకో కథ వినిపించాడు. ఆ తర్వాత మేం చర్చించుకుని ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయాలనుకున్నాం. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ పాయింట్‌ను ఇచ్చింది నేనే కానీ పూర్తి కథను సిద్ధం చేసుకున్నది మాత్రం కిరణే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలంటే నాకు ఇష్టం. హాలీవుడ్‌లో వచ్చిన ‘రాకీ’ ఫ్రాంచైజీని ఫాలో అయ్యాను. తెలుగులో వచ్చిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు బాబాయ్ కల్యాణ్‌గారి ‘తమ్ముడు’, శ్రీహరిగారి ‘భద్రాచలం’ నాకు చాలా ఇష్టం.
యాక్షన్ విత్ ఎమోషన్... ‘గని’ సినిమాలో నేను చేసిన గని క్యారెక్టర్‌లో షేడ్స్ ఉంటాయి. లక్ష్యం ఏంటో తెలుసు కానీ, గమ్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో తెలియని యువకుడిలా కనిపిస్తాను. సెకండాఫ్‌లో సరైన గైడ్‌లైన్స్‌తో గని ఎలా విజేతగా నిలిచాడు? అనే అంశాలు ఉంటాయి. అసలు ఓ యువకుడు బాక్సింగ్‌ను వృత్తిగా ఎంచుకుంటే అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది? చాంపియన్‌గా నిలవడానికి అతనికి అడ్డుగా నిలిచే అంశాలు ఏంటి? అనే విషయాలను ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమాలో ఉపేంద్రని డిఫరెంట్‌గా చూస్తారు. మదర్ సెంటిమెంట్ కూడా సినిమాలో కీలకంగా ఉంటుంది.
చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా
అప్పుడు కాస్త ఫీలయ్యా!... గని’ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. తొలిప్రేమ (2018) సినిమా పూర్తయిన తర్వాత ‘గద్దలకొండ గణేశ్’ (2019) స్టార్ట్ కావడానికి ముందే ఫారిన్ వెళ్లి బాక్సింగ్‌లో ఉన్న బేసిక్స్ నేర్చుకున్నాను. ఆ నెక్ట్స్ రామ్‌చరణ్ అన్నయ్య ట్రైనర్ రాకేశ్ ఉడయార్ ఫిట్‌నెస్ విషయంలో నాకు శిక్షణ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు బాక్సింగ్ ట్రైనర్స్ నాతోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. అయితే షూటింగ్ స్టార్ట్ కావడానికి నెల ముందు ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. ‘గని’ షూటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే 2020 జూలై 30 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించాం.
కానీ కోవిడ్ కారణంగా ‘గని’ రిలీజ్ చాలాసార్లు వాయిదా పడింది. కాస్త ఫీలయ్యాను. నా కజిన్స్ అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలుగా చేస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. పైగా దర్శకుడు కిరణ్, సయీ మంజ్రేకర్‌కు ‘గని’ చిత్రమే తెలుగులో తొలి సినిమా. దీంతో నేనే సినిమాను ముందుకు నడిపించేలా ఎక్కువ బాధ్యతను తీసుకున్నాను. ఈ సినిమాతో మరింత క్రమశిక్షణ అలవడింది. ‘మిస్టర్, అంతరిక్షం’ సినిమాల ఫలితాలు భిన్నంగా ఉన్నా కొత్త విషయాలు నేర్చుకున్నా.
చదవండి: ఉపేంద్ర డైరెక్షన్‌లో మెగాస్టార్ చిత్రం.. కానీ!
ఆ హీరోలతో మల్టీస్టారర్స్... అల్లు అర్జున్‌గారి ‘పుష్ప’, రామ్‌చరణ్‌గారి ‘ఆర్‌ఆర్‌ఆర్’లకు మంచి స్పందన రావడం హ్యాపీ. అలాగే తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతున్నందుకు ఓ తెలుగు హీరోగా కూడా హ్యాపీ. కథ కుదిరితే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ చేస్తా. సాయిధరమ్‌తేజ్, నితిన్‌లతో మల్టీస్టారర్ ఫిల్మ్స్ చేయడం అంటే ఇష్టం. తర్వాతి చిత్రాలు... వెంకటేశ్‌గారితో నటిస్తున్న ‘ఎఫ్ 3’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ కమిటయ్యాను. మరో మూడు కథలు విన్నాను.
Comments
Please login to add a commentAdd a comment