స్టార్ హీరోలతో సినిమాలు చేసిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ మూవీలతోనూ మెప్పించింది. ఎన్నో సినిమాలను ముందుండి నడిపించిన ఆమె లేడీ అమితాబ్ అన్న బిరుదును దక్కించుకుంది. ఓ పక్క గ్లామర్ హీరోయిన్‌గా నటిస్తూనే కర్తవ్యం నుంచి ఒసేయ్ రాములమ్మ దాకా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసింది. తాజాగా విజయశాంతి తన సినీకెరీర్ గురించి మాట్లాడింది.
'నేను దాదాపు 180 దాకా సినిమాలు చేశాను, అన్ని భాషల్లో నటించాను. అందులో లేడీ ఓరియంటెడ్ చిత్రాలే నాకు ఎక్కువ ఇష్టం. నా చిన్నవయసులోనే నాన్న గుండెపోటుతో మరణించారు. ఆ బెంగతో అమ్మ మంచానపడింది. కొన్నాళ్లకే అమ్మ కూడా చనిపోయారు. ఆ తర్వాత నేను ఎవరి మీదా ఆధారపడకుండా బతికాను. నా పెళ్లి కూడా నేనే చేసుకున్నాను. నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఐదు వేలు, కానీ అందులో కొంత ఎగ్గొట్టి మూడు వేలే ఇచ్చారు. మూడు వేల నుంచి కోటి రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్లాను. ఆ కాలంలో భారత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 3 సినీతారల్లో రజనీకాంత్, అమితాబ్‌తో పాటు నేను కూడా ఉన్నాను.
చాలాసార్లు నేను చచ్చి బతికాను. ఓసారి విమాన ప్రమాదం.. మరోసారి నీళ్లలో కొట్టుకుపోయాను. ఇంకోసారి మంటల్లో చిక్కుకున్నాను, మరోసారి ట్రైన్ నుంచి కిందపడిపోబోయాను.. ఇంతా జరిగినా బతికిపోయాను. లేడీ బాస్ క్లైమాక్స్‌లో రైలు కంపార్ట్‌మెంట్ మారాలి. నేను బయటకు వస్తుండగా నా చేతు స్లిప్ అవడంతో కింద రాడ్ పట్టుకున్నాను. రైలు కదులుతూనే ఉంది, నేను గాల్లో ఎగురుతున్నాను. ఎలాగోలా తిరిగి కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాను. ఏమాత్రం స్లిప్ అయినా లోయలో పడేదాన్ని. అప్పటికే అందరూ భయపడి ఏడ్చేశారు. ఈ షాట్ వద్దన్నారు. కానీ నేను మాత్రం పర్వాలేదని మరో టేక్‌లో పూర్తి చేశాను.
తమిళ సినిమా షూటింగ్‌లో నన్ను కుర్చీలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టే సన్నివేశం అది. నన్ను తాళ్లతో కట్టేశారు. గుడిసెకు నిప్పు పెట్టారు. అప్పుడు గాలి ఎక్కువగా వీయడంతో నా చీరకు, జుట్టుకు నిప్పంటుకుంది. అది చూసిన హీరో విజయ్‌కాంత్ వెంటనే లోపలకు వచ్చి నన్ను కాపాడాడు. ఇలా చాలాసార్లు చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాను' అని చెప్పుకొచ్చింది విజయశాంతి.
Comments
Please login to add a commentAdd a comment