కోలీవుడ్ హీరో విక్రమ్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టక ముందు తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు. విక్రమ్- పా రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తంగలాన్ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. అక్కడ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తంగలాన్ లాంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలని ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు విక్రమన్‌ను ప్రశంసించారు. ఈ క్రమంలో సినిమా గురించి విక్రమ్ ఇలా చెప్పుకొచ్చారు.
'ఈ సినిమాలో పనిచేసిన సహాయ దర్శకులకు కృతజ్ఞతలు. నటుడు పశుపతితో ఇది నా ఆరో సినిమా. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన పాత్ర గురించి పెద్దగా చర్చ జరుగుతుంది. మాళవిక ఈ సినిమాలో ఆర్తి పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మలయాళ నటి పార్వతితో నటించాలని చాలాసార్లు అనుకున్నాను. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ పెద్ద హిట్ అవుతుంది.
సేతు, శివ పుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాల్లో చాలా కష్టపడి ఆయా పాత్రలను పోషించాను. కానీ తంగలాన్‌తో పోలిస్తే ఆ పాత్రలు కేవలం 8 శాతం మాత్రమే. తంగలాన్ ప్రపంచంలో మీరు తప్పకుండా సంతోషిస్తారు. ఈ పాత్ర మనకు బాగా కనెక్ట్ అవుతుంది. నా చిన్నతనం నుంచే నటుడిని కావాలని కలలు కన్నాను. ఈ క్రమంలో 8వ తరగతి వరకు బాగా చదివాను. ఆ తర్వాత నటించాలనే కోరికతో పెద్దగా చదువుకోలేదు. అదృష్టవశాత్తూ పాస్ అయి కాలేజీలో చేరాను. అక్కడ నాటకంలో నటిస్తున్నప్పుడు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. కానీ ఆ రోజు నా కాలు విరిగింది. దీంతో సంవత్సరం పాటు నేను మంచం మీద ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 23 ఆపరేషన్స్ జరిగాయి.
నేను నడుస్తున్నానని డాక్టర్ చెప్పినప్పుడు మా అమ్మ ఏడ్చేసింది. కానీ, నేను తప్పకుండా నడుస్తానని చెప్పాను. సుమారు పదేళ్ల పాటు ఆ సమయంలో కష్టపడ్డాను. నా కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.750 జీతానికి పనికి వెళ్లాను. అలాంటి సమయంలో కూడా సినిమాల్లో నటించాలనే తపనను మాత్రం వదల్లేదు. దీంతో కొన్ని అవకాశాలు వచ్చాయి. అలా నా పోరాటం సాగించడంతోనే ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. ఒకవేళ అప్పుడు సక్సెస్ కాకపోతే సినిమా అవకాశాల కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండేవాన్ని. అనుకున్నది సాధించాలంటే కష్టం తప్పదని గుర్తుపెట్టుకోండి. అంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment