
సౌత్ ఇండియా స్టార్ హీరో విశాల్ CBFC (Central Board of Film Certification)పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ బోర్డ్ లంచం తీసుకున్నారంటూ ఆధారాలతో సహా ఆయన వీడియో రిలీజ్ చేశారు. విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజాగా స్పందించి.. ఈ విషయం చాలా దురదృష్టకరమని, త్వరలోనే విచారణ చేపడుతామని ఒక సీనియర్ అధికారిని ముంబైకి కూడా పంపించింది. తర్వాత విశాల్ కూడా ఈ విషయాన్ని అంతటితో ఆపేశాడు.
(ఇదీ చదవండి: 'పవన్ కల్యాణ్ సినిమాతో కష్టాలు వస్తే.. జూ.ఎన్టీఆర్ తిరిగి నిలబెట్టాడు')
ఐతే ఈ వ్యవహారం అంతటితో ముగియలేదని తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో కూడా సెన్సార్ బోర్డు అధికారులపై పలు విమర్శలు రావడంతో.. కేంద్ర స్థాయిలో సెన్సార్ బోర్డు మీద వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల నిగ్గు తేల్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాల్ ఆరోపణలపై చర్చించారని తెలుస్తోంది. సెన్సార్ బోర్డులో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు సమాచారం.
త్వరలో అన్ని రాష్ట్రాల సెన్సార్ బోర్డు ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారట. విశాల్ చేసిన ఆరోపణలు నేషనల్ మీడియాలో కూడా ప్రధానంగా రావడంతో దేశం మొత్తం సంచలనంగా మారింది. దీంతో ముంబై సెన్సార్ బోర్డులో కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికి విశాల్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.