ఓ హీరో చెల్లెళ్లు, ప్రేయసితో కలిసి ఆడి పాడుతున్నారు.
మరో హీరో ఏమో హీరోయిన్‌తో ప్రేమ పాటకు స్టెప్పులేస్తున్నారు.
ఇంకో హీరో మాస్ నంబర్‌కు హుషార్‌గా కాలు కదుపుతున్నారు. ‘ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్’ అంటూ ఆ హీరోలు చేస్తున్న పాటల గురించి తెలుసుకుందాం.
ఫ్యామిలీ సాంగ్
ఆనందోత్సాహలతో ఫ్యామిలీ పాట పాడుతున్నాడట ‘విశ్వంభర’. చెల్లెళ్లు, ప్రేయసితో కలిసి హాయిగా డ్యాన్స్ చేస్తున్నాడట. ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్‌కు కారణమైన హ్యాపీ మూమెంట్స్ ఏంటో ‘విశ్వంభర’ సినిమాలో చూడాలి. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ‘స్టాలిన్’ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’ కోసం చిరంజీవితో జోడీ కట్టారు త్రిష. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర భీమవరం దొరబాబు అని, కథ రీత్యా దొరబాబుకు ఐదుగురు చెల్లెళ్లు
ఉంటారనే ప్రచారం సాగుతోంది.
చిరంజీవి చెల్లెళ్లుగా మీనాక్షీ చౌదరి, మృణాల్ ఠాకూర్, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కనిపిస్తారని భోగట్టా. కాగా ‘విశ్వంభర’ తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముందుగా కొంత టాకీ పార్ట్ చిత్రీకరించారు. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ ఆరంభించారని తెలిసింది. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి స్వరకర్త. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘హిట్లర్’ (1997) సినిమాలో హీరో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్లకు చిరంజీవి మళ్లీ ఐదుగురు చెల్లెళ్లతో ‘విశ్వంభర’ చేస్తున్నారు.
రొమాంటిక్ కల్కి
ఇటలీ బీచ్‌లో ప్రేమ పాట పాడుతున్నారు ప్రభాస్. ఈ రొమాంటిక్ పాట ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఇందులో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.
పుష్పరాజ్ పాట
మంచి ఫైర్ మీద ఉన్నాడు పుష్పరాజ్. తన సత్తా ఏంటో పాట రూపంలో మరోసారి చెబుతున్నాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లోని ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఓ మాస్ సాంగ్ ఉంటుంది. ఈ తరహా సాంగ్ ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ ఉందట. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడి యోలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటకు ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిన్నారు. తొలి భాగంలో శ్రీవల్లి పాత్రలో ప్రేయసిగా నటించిన హీరోయిన్ రష్మికా మందన్నా మలి భాగంలో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment