‘‘పెళ్లనేది పవిత్రమైనది. దాన్ని గౌరవించాలనే కోణంలో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాం. యువతరంతో పాటు అన్ని వయసుల వారికీ కనెక్ట్ అయ్యే కథ ఈ చిత్రంలో ఉంది. పెద్ద హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు వీకే నరేశ్. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. నరేశ్‌కి జోడీగా పవిత్రా లోకేష్ నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా గురువారం వీకే నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారు (విజయ నిర్మల) తన ఆలోచనలను సినిమాల్లో చూపించాలని కృష్ణగారితో కలసి 1972లో విజయకృష్ణ మూవీస్‌ని స్థాపించారు. ఈ బేనర్ స్థాపించి 50 ఏళ్లు, నా సినీ జీవితం ప్రారంభించి కూడా యాభై ఏళ్లు. ఈ సమయంలో హీరోగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా వినోదంతో పాటు షాకింగ్‌గా ఉంటుంది.. నటుడిగా థ్రిల్‌గా ఉంది.
పదికోట్ల మందిలో వందమంది కూడా బిజీగా ఉండరు. ఇక సినిమాలకు వస్తే.. పది మంది హీరోలే బిజీగా ఉంటారు. నేను హీరోగా హిట్స్ ఇచ్చాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఇప్పుడు మళ్లీ హీరోగా చేస్తున్నాను. విజయకృష్ణ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్‌ని మళ్లీ తీసుకురావడం, కృష్ణ–విజయ నిర్మలగార్ల వారసత్వాన్ని కాపాడటం, ఒక మంచి ఎంటర్‌టైనర్ ఇవ్వడం.. ఇవన్నీ నిర్మాతగా నాకు పెద్ద బాధ్యత. ఈ విషయంలో రాజుగారిని నమ్మాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment