రైతుకు భరోసా ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్: వానాకాలం సీజన్ దాటుతున్నా.. రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 8.77 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు పాత జాబితా ప్రకారమే అందజేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత నిలిపేసింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, చెట్లు, గుట్టలు, రోడ్లు, ఇటుక బట్టీల స్థలాలకు కూడా గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో నిలిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు ప్రకటించింది. రైతుభరోసాలో మార్పులు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం యత్నించినా దీనిపై నేటికీ ఎలాంటి ప్రకటన లేదు. అధికారులను అడిగితే ఇంకా మార్గదర్శకాలు అందలేదని చెబుతున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో 8,77,173 మంది
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతుభ రోసాకు అర్హులు ఉన్నారు. హనుమకొండ జిల్లాలో 1,50,982 మంది, వరంగల్‌లో 1,54,405, జేఎస్ భూపాలపల్లిలో 1,16,574, ములుగులో 76,692, జనగామలో 1,85,937, మహబూబాబాద్‌లో 1, 92,583 మంది రైతులకు గత యాసంగిలో రూ.880 కోట్ల రైతుబంధు అందింది. ఈ సీజన్‌లో భరోసా కల్పించకపోవడంతో మళ్లీ రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
అదనపు భారం..
గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉన్నా ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుబంధు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎకరానికి రూ.7,500 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ లెక్కన ప్రతీ సీజన్‌లో రూ.880 కోట్ల వరకు వచ్చే రైతుభరోసా సాయం మరో రూ.440 కోట్లు పెరిగి అదనపు భారం కానుంది. అనర్హులను గుర్తించి తొలగించి కొంత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. వీటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
కౌలు రైతులు, రైతు కూలీలపై సస్పెన్స్
రైతులతో పాటు రైతు కూలీలు, కౌలు రైతులకు భరోసా కల్పిస్తామన్న ప్రభుత్వం.. ఆ రెండింటిపై ఇంకా సస్పెన్స్ పెట్టింది. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు, కౌలు రైతులకు రైతులతో సమానంగా రూ.15వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఈరెండింటిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. ఈనెల 20న రాష్ట్ర మంత్రివర్గం భేటీ ఉంటుందని శనివారం ప్రకటించారు. బహుశా ఈ కీలకభేటీలో రైతు భరోసాతో పాటు రైతు కూలీలు, కౌలు రైతుల అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ సమావేశం అనంతరమే మార్గదర్శకాలు అధికారులకు అందనుండగా.. అప్పటి వరకు వేచి చూడాలని అంటున్నారు.
జిల్లాల వారిగా గతేడాది యాసంగిలో రైతు భరోసా
లబ్ధిదారులు, అందిన సాయం
హనుమకొండ
1,50,982
136,08,18,594
వరంగల్
1,54,405
136,47,64,319
మహబూబాబాద్1,92,583
203,80,86,807
రైతులు
నిధులు
జయశంకర్ భూపాలపల్లి 1,16,574
117,47,18,093
జనగామ
1,85,937
206,70,50,167
ఉమ్మడి జిల్లాలో 8.77 లక్షల మంది రైతుల ఎదురుచూపు
వానాకాలం సీజన్‌కు ఇంకా అందలే..
రైతుభరోసాపై ఫైనల్ కాని నిర్ణయం
వ్యవసాయశాఖకు అందని కొత్త మార్గదర్శకాలు
కౌలు రైతులు, కూలీలపై రాని స్పష్టత
20న కేబినెట్ సమావేశం.. అప్పటిదాకా ఆగాల్సిందేనా?
Comments
Please login to add a commentAdd a comment