ములుగు రూరల్: ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన ఆశ వర్కర్లను ప్రభుత్వం నిర్బంధించడం సరికాదని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆశ వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఈ నెల 24వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఆశాలు వెళ్లకుండా నిర్బంధించారని తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న కొందరిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. ఆశ వర్కర్లు బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనం రూ.18 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించాలని, ఏఎన్‌ఎం ట్రైనింగ్ చేసిన ఆశాలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, మంజూల, యశోద, రమ, పద్మ, కవిత, రజిత, స్వప్న, లక్ష్మీ, విజయ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్


