ములుగు: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్ల వారీగా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలన్నారు. గొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పొగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలన్నారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో సెలవులపై వెళ్లే సమయంలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున సురక్షితమైన చర్యలు తీసుకునే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ పెట్టి మోసపోకుండా స్టేషన్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింగరావు ఆధ్వర్యంలో నియమ నిబంధనలపై వివరించారు. ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్‌బీఐ ఇన్‌స్పెక్టర్ రమేష్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


