సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వాజేడు/వెంకటాపురం(కె): ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. వాజేడు మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో గురువారం ఆయన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే హాస్టళ్లలోని విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని తెలిపారు. రేషన్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ సన్నబియ్యం అందుతాయని తెలిపారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని వివరించారు. యువవికాసం పేరుతో నిరుద్యోగులకు సైతం అండగా నిలుస్తుందని తదితర వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూగూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూనెం రాంబాబు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్‌ఐ కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని మూతపడిన శివాలయాన్ని సందర్శించారు. గుడి పున ప్రారంభానికి తగిన సహకారం అందించాలని పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణానికి రూ.8లక్షలతో నిర్మాణం చేస్తున్నట్లు ఎంపీడీఓ విజయం తెలిపారు. అలాగే సుందరయ్య కాలనీకి చెందిన అల్లి సాయిప్రకాశ్ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా వెంకటాపురం(కె)మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామంలో బాండ్ మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. మండల కేంద్రంలోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ బెస్తగూడెం గ్రామ శివారులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, నాయకులు పాల్గొన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి


