మొక్కజొన్న రైతులకు అండగా ఉంటాం..
వెంకటాపురం(కె): మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయిన బాధిత రైతులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మండల పరిధిలోని బర్లగూడెం పంచాయతీ చిరుతపల్లిలో ఆయన శనివారం పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న మొక్కజొన్న రైతులు చందర్‌రావు, మధు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలు ఇచ్చిన బాండ్ మొక్కజొన్న కంపెనీలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. అనంతరం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, గిరిజన రైతులు, అన్ని శాఖల జిల్లా, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో బాండ్ మొక్కజొన్న సాగు చేసి రైతులు నష్టపోయి పోరాటాలు చేస్తుంటే వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులు నష్టపోయేలా చేసిన కంపెనీ ఆర్గనైజర్లు ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో బాండ్ మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు బృందాలుగా పర్యటించి ప్రతీ రైతు ఇంటికి వెల్లి వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 950మంది రైతులు పంట నష్ట పోయారని వివరించారు. ఇంకా ఎవరైనా రైతులు పంట నష్టపోయి ఉంటే ఈ నెల 10వ తేదీ వరకు సంబంధిత వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. రైతులకు నష్టపరిహారం అందించే దిశగా కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించామని త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. రైతుల ఖాతాల్లో నేరుగా పంట నష్ట పరిహారం పడే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ వెంకటేశ్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరావు, సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
హుస్సేన్‌నాయక్
మొక్కజొన్న రైతులకు అండగా ఉంటాం..


