భయం గుప్పిట్లో ఏజెన్సీ
ములుగు: బచావో కర్రిగుట్టల పేరుతో కేంద్ర సాయుధ బలగాలు, తెలగాణ సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్‌తో సరిహద్దు గ్రామాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సాయుధులైన సుమారు 2000 మంది పోలీసు బలగాలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ముందుకు సాగుతున్నాయి. మంగళవారం నుంచి దట్టమైన అడవిలో కాలు మోపిన బలగాలకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను అందించేందుకు కేంద్రం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. యుద్ధ బలగాలను గుర్తించి సరుకులను అందిస్తోంది. దీంతో బలగాలు రెట్టింపు వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే కర్రిగుట్టల చుట్టు బాంబులను అమర్చినట్లు మావోయిస్టులు కర పత్రాలను విడుదల చేసిన నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్స్ వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
30గంటలు దాటినా
కానరాని మావోయిస్టుల ఆచూకీ..
ఇదిలా ఉండగా పోలీసు బలగాలు కర్రిగుట్టల్లో అడుగు పెట్టి 30గంటల సమయం దాటుతున్నప్పటికీ మావోయిస్టుల ఆచూకీ తెలియలేదని సమాచారం. ఒక వేల కర్రిగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకొని ఉండి ఉంటే ఇప్పటికే పోలీసుల సమాచారం మావోయిస్టులకు తెలిసి ఉంటుంది. ఈ ప్రకారం గెరిల్లా శిక్షణ పొందిన మావోయిస్టులు ఎదురు దాడికి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తూర్పువైపు నుంచి ఛత్తీస్‌గఢ్ బలగాలు, పడమర నుంచి తెలంగాణ, కేంద్ర సాయుధ బలగాలు కర్రి గుట్టల్లో ప్రవేశించడం వెనుక గల ఆంతర్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. నివురుగప్పిన నిప్పులా మారిన కర్రిగుట్టల్లో తుపాకీ మోతల శబ్ధాలు వినిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై వాజేడు, వెంకటాపురం(కె) ములుగు జిల్లా పోలీసులను వివరణ కోరగా ఎలాంటి సమాచారం రావడం లేదు.
కర్రిగుట్టలను చుట్టు ముట్టిన సాయుధ బలగాలు
హెలికాప్టర్ల ద్వారా సిబ్బందికి
నిత్యావసర సరుకులు
బచావో కర్రిగుట్టల పేరుతో
కొనసాగుతున్న కూంబింగ్
హిడ్మా, దామోదర్ ఉన్నారా?
రోజు రోజుకూ బలహీన పడుతున్న మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్ర కమిటీలో ఉన్న మడవి హిడ్మా, దామోదర్ వంటి అగ్రనేతలు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వ్యాపించి విస్తారంగా ఉన్న అడవిలో కర్రి గుట్టలను స్థావరంగా మార్చుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనతో బలగాలు రెట్టింపుగా కూంబింగ్‌కు దిగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులను కోల్పోవడం, మరి కొందరు లొంగుబాటుతో పార్టీకి దూరమవడంతో మావోయిస్టు పార్టీ రోజు రోజుకు బలహీన పడుతోంది. ఈ క్రమంలో మడవి హిడ్మా, దామోదర్‌లు కర్రి గుట్టల్లో ఉండవచ్చనే నిఘా వర్గాల సమాచారంతో సాయుధులైన పోలీసు బలగాలు ముందుకు చొచ్చుకు పోతున్నట్లు తెలుస్తోంది.


