
బీసీ బాలుర గురుకులంలో రాత్రి బస చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్
తెలకపల్లి: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకులంలో మంగళవారం రాత్రి కలెక్టర్ బదావత్ సంతోష్ బస చేశారు. రాత్రి 7:30 గంటలకు గురుకులానికి చేరుకున్న కలెక్టర్.. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. వంటగదిలో బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని.. నాణ్యత విషయంలో రాజీపడొద్దని ఉపాధ్యాయులకు సూచించారు.
సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా అటుకులు, రాగిమాల్ట్ అందిస్తున్నారా లేదా అని విద్యా ర్థులతో ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల డార్మెంటరీలను పరిశీలించారు. తరగతుల వారీ గా విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎస్‌ఎస్‌సీలో 10/10 గ్రేడ్ సాధించే విద్యార్థులకు సెల్‌ఫోన్‌లు బహుమతిగా అందిస్తానని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, అక్కడే బస చేశారు.