నాగర్‌కర్నూల్ క్రైం: ప్రస్తుతం ఏ వ్యక్తికి అయినా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్తే.. వైద్యులు రక్త పరీక్షలతో పాటు స్కానింగ్‌పైనే ఆధారపడి రోగాన్ని గుర్తించే రోజులు ఇవి. ఆర్థిక భారం మోయగలిగే వారు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి జబ్బును నయం చేసుకుంటారు. డబ్బులేని పేదలు మాత్రం ఆధారపడేది ప్రభుత్వ ఆస్పత్రులపైనే. ఈ నేపథ్యంలో జిల్లా జనరల్ ఆస్పత్రిలో స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు సెంటర్లలో స్కానింగ్ చేయించుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాలుగు నెలలుగా మూత..
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నప్పటికీ.. జనరల్ ఆస్పత్రిలో నాలుగు నెలలుగా రేడియాలజిస్టు అందుబాటులో లేకపోవడంతో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో గర్భిణులు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు, ఇతర రోగులు స్కానింగ్ చేయించుకోవాలంటే ప్రైవేటు సెంటర్లే దిక్కయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉచితంగా చేసే స్కానింగ్‌కు ప్రైవేటు సెంటర్లలో రూ.800 వసూలు చేస్తున్నారు. అదే విధంగా ఆరు నెలలకోసారి గర్భిణులకు చేయాల్సిన టిఫా స్కానింగ్ కోసం రూ. 1,800 వరకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో చెల్లిస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్ అవసరమయ్యే ప్రతి రోగిపై ఆర్థిక భారం పడుతుందని.. జనరల్ ఆస్పత్రిలో రేడియాలజిస్టును నియమించాలని కోరుతున్నారు.
ఆసక్తి చూపని రేడియాలజిస్టులు
ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రేడియాలజిస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వారికి చెల్లించే జీతం కూడా రూ.లక్షల్లో ఉండటంతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు తర్వాత సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసేందుకు రేడియాలజిస్టు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రేడియాలజిస్టు కాలపరిమితి ముగిసిన తర్వాత వెళ్లిపోవడంతో స్కానింగ్ సేవలు నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న రేడియాలజిస్టు పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేసినా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రోజు జనరల్ ఆస్పత్రికి దాదాపు వెయ్యి మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వారిలో చాలా మందికి స్కా నింగ్ సేవలు అవసరం పడుతుండటంతో ఇబ్బందికరంగా మారింది. జనరల్ ఆస్పత్రిలో స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment