చెంచులకు నేచర్ గైడ్ ప్రతిభ పరీక్ష
మన్ననూర్: ప్రకృతి మార్గదర్శి (నేచర్ గైడ్)పై ఆసక్తి కలిగి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ చెంచు యువతీ, యువకులకు సోమవారం మన్ననూర్‌లోని ఐటీడీఏ ప్రాంగణంలో అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని కొల్లాపూర్, లింగాల, బల్మూర్, అచ్చంపేట, పదర, అమ్రాబాద్ మండలాలకు చెందిన 61 మంది ఆదివాసీ చెంచులు హాజరయ్యారని అటవీశాఖ ఎడ్యుకేషనల్ అధికారి శ్వేత తెలిపారు. పరీక్షలో ప్రతిభ కనబరిచి అర్హత సాధించగా ఎంపిక చేసిన 30 మంది అభ్యర్థులకు అన్ని ఖర్చులు అటవీశాఖ భరించి బెంగుళూరులో నెలరోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించి అర్హతను ధృవీకరించే అధికారిక పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నేచర్ గైడ్స్ కావాలనే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో వీరికి మొదటి ప్రాధాన్యతగా ఉపాధి అవకాశం కల్పించేందుకు చొరవ చూపిస్తామన్నారు. నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణతోపాటు బాధ్యతాయుత పర్యాటక విధానాలను మెరుగుపరచడం దీని ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ ఎఫ్‌బీఓ మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment