అంతా వారి కనుసన్నల్లోనే..!
కల్వకర్తి బల్దియాలో
కిందిస్థాయి సిబ్బందిదే పెత్తనం
● అర్హతకు మించి విధులు నిర్వర్తిస్తున్న
కొందరు ఉద్యోగులు
● రెగ్యులర్ ఉద్యోగులకు నామమాత్రంగా విధులు
●
చర్యలు తీసుకుంటాం..
నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్లను వారివారి స్థానాల్లో కేటాయిస్తాం. అర్హత గల వారినే కార్యాలయ విభాగాల్లో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఎవరి పనుల్లో వారే ఉండేలా ప్రక్షాళన చేసి.. ఔట్‌సోర్సింగ్ వారిని విభాగాల్లో కాకుండా సాధారణ పనుల్లో విధులు కేటాయిస్తాం.
– మహమూద్ షేక్,
మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన విభాగాలైన ఇంజినీరింగ్, అకౌంట్స్ విభాగాల్లో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే వేదం. ఆయా విభాగాల్లో రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నా.. కార్యాలయంలో ఆఖరి పోస్టు (ఆఫీస్ సబార్డినేట్)లో పనిచేసే వారే శాసిస్తారు. వారిని ప్రసన్నం చేసుకుంటేనే ఏ ఫైల్ అయినా ముందుకు కదులుతుంది. కాంట్రాక్టుల విషయంలోనూ వారు చెప్పిందే కొటేషన్‌లో ఉంటుంది. మున్సిపాలిటీలో వీరంతా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తూ బ్యాక్‌లాగ్ పోస్టుల ద్వారా రెగ్యులర్ ఉద్యోగాలకు ఎంపికై .. ఇప్పుడు కార్యాలయాన్నే శాసించే స్థాయికి ఎదిగారు. ఆయా శాఖల్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పోవడం తప్ప.. వీరిని కాదని పనిచేస్తే ఉన్నతాధికారుల నుంచి వాయింపు తప్పడం లేదని వాపోతుండటం గమనార్హం.
● అధికారులకు నచ్చితే చాలు.. అర్హత లేకున్నా ఎలాంటి విధులైనా నిర్వర్తించవచ్చు కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించినా వారిని మాత్రం ఇక్కడ పక్కన పెడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందికి పాలకులు, కాంట్రాక్టర్ల అండదండలు ఉండటంతో పూర్తిస్థాయిలో కార్యాలయాన్ని శాసిస్తున్నారు. బదిలీపై అధికారులు వచ్చినా.. వారికి నామమాత్రమైన విధులను కేటాయిస్తూ.. కిందిస్థాయి సిబ్బందితోనే అన్ని కార్యకలాపాలను సాఫీగా చేయించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో మున్సిపాలిటీలో ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతోంది. అయితే అధికారులకు అమ్యామ్యాలు అందుతుండటంతోనే వారిని ఆయా స్థానాల నుంచి కదిలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నా..
కల్వకుర్తి మేజర్ గ్రామపంచాయతీ 2012లో నగర పంచాయతీగా, 2014లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. అప్పట్లో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న సిబ్బందితోనే కార్యాలయ విభాగాలను నెట్టుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్–4 ద్వారా రెగ్యులర్ ఉద్యోగులను భర్తీ చేసింది. తద్వారా కల్వకుర్తి మున్సిపాలిటీకి సుమారు 11 మంది జూనియర్ అసిస్టెంట్లతో పాటు వార్డు ఆపీసర్లను సైతం కేటాయించారు. వీరిలో వార్డు ఆపీసర్లు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుండగా.. జూనియర్ అసిస్టెంట్లకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పూర్తిస్థాయి శాఖను కేటాయించ లేదు. దీంతో రోజు వారు కార్యాలయంలో ఖాళీగా ఉంటున్నారు. వారికి కనీసం మున్సిపాలిటీ విధులపై అవగాహన కల్పించకపోవడం గమనార్హం.
కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం
స్థాన చలనం కలిగేనా..?
మున్సిపాలిటీలో కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది కమిషనర్లు మారారు. సిబ్బంది వ్యవహార తీరును మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారుల పట్టింపు లేకపోవడంతో వారంతా చివరకు ఆయా శాఖల్లోని ఉన్నతాధికారులను శాసిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే ఆయా విభాగాల్లో పనులను చక్కబెడుతున్నారు. అయితే కొందరు సిబ్బందికి గత పాలకవర్గం అండగా నిలుస్తూ వచ్చిందనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం పాలకవర్గం లేనందున ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అర్హత గల ఉద్యోగులను వారివారి స్థానాలకు కేటాయిస్తారో లేదో వేచి చూడాలి.
అంతా వారి కనుసన్నల్లోనే..!
Comments
Please login to add a commentAdd a comment