శివం శంకరం
అచ్చంపేట/కొల్లాపూర్: ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ శంభో శంకర.. సర్వేశ్వర సదా స్వరామి అంటూ నల్లమలలోని శైవ క్షేత్రాలు మార్మోగాయి. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్కంటిని భక్తులు దర్శించుకొని పునీతులయ్యారు. లింగోద్భవ కాలంలో ఆదిదేవుడి దర్శనానికి బారులు దీరారు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, అంతరగంగా, భౌరాపూర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొల్లాపూర్ మండలం సోమశిల లలితాంబికా సోమేశ్వరాలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఆలయ సమీపంలోని కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని తన్మయం చెందారు. అమరగిరి సమీపంలోని మల్లయ్య సెల, కొల్లాపూర్ శివాలయం, మన్ననూర్ లింగమయ్య, దోమలపెంట ఉమామహేశ్వరాలయం, లొద్దిమల్లయ్య క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసదీక్ష చేపట్టారు. రాత్రి జాగరణ చేశారు. ఆలయాల వద్ద దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
నల్లమలలో జనసంద్రమైన శైవక్షేత్రాలు
శివం శంకరం
Comments
Please login to add a commentAdd a comment