పరిశోధనలపై ఆసక్తితోనే ఉన్నత స్థాయికి..
బిజినేపల్లి: సైన్స్‌ను ఇష్టపడి శాస్త్రవేత్త కాలేకపోయినా.. జీవితకాలం సైన్స్ ఫ్యాకల్టీగా సైన్స్ పరిశోధనలపై ఆసక్తితోనే ప్రతాప్ కౌటిల్య ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేందర్‌సింగ్ అన్నారు. ప్రతాప్ కౌటిల్య 2025 సంవత్సరానికి గాను అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం అందుకోవడంతో గురువారం ఆయనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ రాజేందర్‌సింగ్ ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రతాప్ కౌటిల్య పరిశోధన పట్ల అభిరుచితో సైన్స్ డాట్ కామ్, సైన్స్ నేచర్ వంటి మూడు పుస్తకాలు రచించారన్నారు. ఇందుకు గాను ఆయనకు 2019 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ప్రతిభా అవార్డు, 2024లో జాతీయ పురస్కారం అందుకున్నారన్నారు. అనంతరం ప్రతాప్ కౌటిల్యకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రొఫెసర్ యాదగిరి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
స్పోర్ట్స్ అకాడమీలోప్రవేశాలు
కందనూలు: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025– 26 సంవత్సరానికి మోడల్ స్పోర్ట్స్ పాఠశాల, వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్‌లాగ్ ఖాళీలు పూర్తి చేస్తూ.. ప్రస్తుతం 4, 5, 6, 7 తరగతులు చదువుతున్న గిరిజన బాల, బాలికలు అర్హులన్నారు. జిల్లా స్థాయి ఎంపికలను వచ్చే నెల 12 నుంచి 16 వరకు అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తామని చెప్పారు.
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో గురువారం తగ్గింది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 2,418 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. గురువారం ఉదయానికి 365 క్యూసెక్కులకు తగ్గిపోయాయి. జూరాలలో నీటి మట్టం తగ్గడంతో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా.. ఇక్కడికి కేవలం 2,418 క్యూసెక్కులు 24 గంటల పాటు చేరాయి. అనంతరం పూర్తిగా ఇన్‌ఫ్లో తగ్గింది. తాగు, సాగు నీటికి ఈ సారి తిప్పలు తప్పేలా లేనట్లుగా కనిపిస్తోంది. ఆవిరి రూపంలో 75 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టుకు 625, భీమా లిఫ్టు–1కు 550, కోయిల్‌సాగర్‌కు 220, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 375, ప్రాజెక్టు నుంచి మొత్తం 2495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 4.721 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment