ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అచ్చంపేట: జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఉన్నత స్థాయి అధికారులు శుక్రవారం కలెక్టర్లతో వీసీ నిర్వహించగా.. ఎస్‌ఎల్‌బీసీ వద్ద సహాయక చర్యలు సమీక్షిస్తున్న కలెక్టర్ బదావత్ సంతోష్ ఎస్‌ఎల్‌బీసీ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. వీరికోసం 33 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,477 మంది విద్యార్థులు ఉండగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,977 మంది ఉన్నారన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌తో పటిష్ట నిఘా పెడతామని వివరించారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి కస్టోడియన్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పూర్తిగా మూసివేయించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచించామన్నారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్‌ఎస్ పాకెట్లు ఇతర మందులతో మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, ఆశాలు అందుబాటులో ఉంటారన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా, పరీక్ష కేంద్రాల వద్ద మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక వసతలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment