పరిస్థితి సంక్లిష్టం..
నాగర్‌కర్నూల్
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో అవశేషాల గుర్తింపుపై వీడని సందిగ్ధం
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యతపై స్పష్టత కరువైంది. వారి కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాల్లో పొంతన లేకుండా పోయింది. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. సహాయక చర్యలను వేగిరం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు పాల్గొంటున్నప్పటికీ.. ప్రధానంగా సింగరేణి కార్మికులే అధికంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా.. కార్మికుల ఆచూకీ లభ్యతపై సందిగ్ధం వీడటం లేదు. మరోవైపు జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలు కనుగొన్నామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆదివారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో దాదాపు గంటన్నర పాటు సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యతపై స్పష్టతనివ్వలేదు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వయంగా సీఎం ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొండల నుంచి నీరు
వస్తుండటంతోనే..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కొండల నుంచి నీరు రావడమేనని అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫారెస్ట్‌లో ఉన్న తిర్మలాపూర్ సమీపం నుంచి లేదా మల్లెలతీర్థం నుంచి నీరు వస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జియోలాజికల్ సర్వే అధికారులు అటవీ శాఖ అధికారులతో కలిసి నీటి ధారలు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయనే కోణంలో సర్వే చేపట్టారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో ప్రమాదస్థలంలో సముద్ర మట్టానికి 450 మీటర్ల లోతులో కుర్తిపెంట ప్రదేశంలో నీటి పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి పొరలు అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ పరిసర అడవుల్లోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు చెబుతున్నారు. వాగుల ప్రవాహంతోనే నీరు వస్తుందని అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది.
సీఎం పర్యటన సైడ్‌లైట్స్
కార్మికుల ఆచూకీ కోసం
తప్పని ఎదురుచూపులు
తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
భారీగా ఉబికి వస్తున్న నీరు,
బురదతో ఆటంకాలు
Comments
Please login to add a commentAdd a comment