మిర్చికి రూ.25వేల ధర చెల్లించాలి
కల్వకుర్తి రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చికి క్వింటాల్ రూ. 25వేల ధర చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వందలాది ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తున్నారని చెప్పారు. రెండేళ్లుగా మిర్చికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని.. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కౌలు రైతులు ఎకరాకు రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు కౌలు చెల్లించడంతో పాటు రూ. 2లక్షల వరకు పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగుచేస్తున్నారని వివరించారు. ఒకరిద్దరు రైతులకు మాత్రమే గరిష్టంగా 20 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రాగా.. చాలా మందికి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందన్నారు. పండించిన పంటకు మంచి ధర వస్తుందనుకుంటే.. మార్కెట్‌లో రూ. 12వేల నుంచి రూ. 13వేలకు మించి ధర లభించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. రైతులకు మద్దతు ధర చట్టం తేవడంతో పాటు మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా మిర్చిని రూ. 25వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యుడు ఆంజనేయులు, నాయకులు ఆర్.శ్రీనివాస్, బాలస్వామి, ఏపీ మల్లయ్య, బాల్‌రెడ్డి, రామయ్య, ఆంజనేయులు, ఈశ్వర్, శివవర్మ, దశరథం, కిషోర్, నిర్మల తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment