
సదరం శిబిరాలనువినియోగించుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం/ కందనూలు: దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం యూడీఐడీ పోర్టల్‌లో నేరుగా, మీసేవలో దరఖాస్తు చేసుకుని రశీదుతోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ జిరాక్స్ కాపీలను తీసుకుని కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఓ కార్యాలయం రూం నంబర్ ఎఫ్1లో స్లాట్ పొందాలని నమోదు చేసుకోవాలన్నారు. సదరం శిబిరాలను ఈ నెల 17 నుంచి 28 వరకు జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తామన్నారు. శారీరక దివ్యాంగులు ఈ నెల 23, 28, వినికిడి లోపం ఉన్నవారికి 22న, కంటిచూపు లోపం ఉన్నవారికి 17, 25, మానసిక దివ్యాంగులకు 24న ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు.
20న జిల్లా సదస్సు
నాగర్‌కర్నూల్ రూరల్: ఈ నెల 20న ఏఐటీయూసీ, సీఐటీయూ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించే జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, కార్యదర్శి శివశంకర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సంయుక్త సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు లక్ష్మీపతి, వెంకటస్వామి, బాలమురళికృష్ణ, సురేష్, సుభాష్, సత్యం, శివ తదితరులు పాల్గొన్నారు.
నేడు హుండీ లెక్కింపు
చారకొండ: మండలంలోని అపర భద్రాది సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి హుండీ లెక్కింపు బుధవారం చేపడుతున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 11 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలకు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని హుండీలో వేసిన కానుకలను ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ, తహసీల్దార్ సునీత, ఎస్‌ఐ శంషొద్దీన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు లెక్కించనున్నట్లు వివరించారు.
రైతు కమిషన్ చైర్మన్ రాక
వంగూరు: మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి బుధవారం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితోపాటు కమిటీ సభ్యులు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉదయం 9 గంటలకు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం 10 గంటలకు పోల్కంపల్లిలోని రైతువేదికలో రైతులతో సమావేశం కానున్నారు. కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మార్కెట్ వైస్ చైర్మన్ పండిత్‌రావు తెలిపారు.
నల్లమల ప్రాణవాయువుతో సమానం
మన్ననూర్: నల్లమల ప్రాంతం నాకు ప్రాణ వాయువుతో సమానం అని, ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు నాకు ఎంతగానో ప్రేరణ కలిగిస్తాయని వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు, కాళోజీ పురస్కారం గ్రహీత జయరాజ్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పదరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నల్లమల ప్రాంతం అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబాటుకు గురైందని, అయినప్పటికీ ఇక్కడి ప్రజల్లో రాష్ట్రం నలుమూల గుర్తుండిపోయేంత మంచితనం ఉందని, అందుకే నాకు ఈ ప్రాంతం అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా ఎంతో ఇష్టం అన్నారు. దళిత బహుజనులు అంబేడ్కర్ మార్గంలో పయనిస్తూ.. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసేసి తిరిగి రాచరికాన్ని తీసుకువచ్చే కుట్ర జరుగుతుందన్నారు. అంబేడ్కర్ వారసులమైన మనం అగ్రకుల భావాజాలాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో చదువుకు ఉన్న విలువ మరొక దానికి లేదని గమనించి తమ పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ గడుదాస్ వెంకటేశ్వర్లు, కళాకారుడు జక్కా గోపాల్, నాయకులు సత్యనారాయణ, రామలింగం, చిన్న చంద్రయ్య, వెంకటయ్య, ప్రవీణ్‌కుమార్, రాయుడు, బాలింగం, బాలాకుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.