అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
మునుగోడు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరూరి సాయిలు– నాంచారమ్మ కుమారుడు అరూరి శివకుమార్(25) గత కొద్ది రోజులుగా అదే గ్రామంలోని బొమ్మకంటి నర్సింహకు చెందిన ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 26వ తేదీన ట్రాక్టర్‌తో ఓ రైతు పత్తి కట్టె తొలగించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. గమనించిన ట్రాక్టర్ ఓనర్ పత్తికట్టె తొలగించిన రైతు భూమి వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ ట్రాక్టర్ మాత్రమే ఉండడంతో దానిని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా అతడి ఆచూకీ కోసం గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికారు. శుక్రవారం సంస్థాన్‌నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఓ రైతు భూమిలో మృతదేహం చెట్టుకు వేలాడుతుండడంతో కిష్టాపురం గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు శివకుమార్‌గా గుర్తించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత బాధ ఏమీలేదని, తమ కుమారుడిని ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇరుగు రవి తెలిపారు. ఇదిలా ఉండగా.. శివకుమార్ ఓ ఫైనాన్స్ కంపెనీలో తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది 26న అతడి ఇంటికి వచ్చారని, ఈ విషయం తెలిసి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


