సన్న బియ్యం సరిపోయేనా!
ప్రభుత్వ కేంద్రాల్లో మొదలుకాని సన్న ధాన్యం కొనుగోళ్లు
కొన్ని నెలలకు సరిపోయే నిల్వలు..
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటివరకు సన్న బియ్యం ఇస్తుండగా ఇకపై రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యమే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సన్న ధాన్యం కొన్ని నెలలు పంపిణీ చేసేందుకు సరిపోతాయి. రానున్న రోజుల్లో సన్న బియ్యం సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా పెద్దమొత్తంలో సన్న బియ్యం సేకరించి పెట్టుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ బియ్యం అయినా తినాలంటే కనీసంగా 3 నెలల నుంచి 6 నెలల వరకు మగ్గాల్సి ఉంటుంది. లేదంటే ముద్ద అవడం ఖాయమని అధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసే బియ్యం రెండు సీజన్ల ముందటివి అయితేనే ప్రయోజనకరమని, అందుకు అనుగుణంగా సన్న బియ్యం కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసి పంపిణీ చేస్తే ఉపయోగమని పేర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ప్రభుత్వ పరంగా సన్న ధాన్యం కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటికే వరి కోతలు పెద్దమొత్తంలో జరుగుతుండగా, రైతులు సన్న ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు కొంటున్న దాంట్లో ఎక్కువ మొత్తంలో సన్న ధాన్యమే ఉండగా, సాధారణ రకం (దొడ్డు) అంతంత మాత్రంగానే ఉంటోంది. మరోవైపు ప్రభుత్వం ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉన్న సన్న ధాన్యమంతా మిల్లర్లు కొనుగోలు చేస్తే భవిషత్‌లో పేదలకు సన్న బియ్యం సరఫరాలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం నెలకొంది.
దొడ్డు ధాన్యం కేంద్రాలు ప్రారంభం...
రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదట ప్రారంభమయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలోని ఆర్జాలబావి, తిప్పర్తి మండల కేంద్రంలో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లోనూ ఒకొక్కటిగా కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. కానీ, ఎక్కడా సన్నధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.
సన్నాలు కొంటున్న మిల్లర్లు..
సన్న ధాన్యానికి 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మిల్లర్లు సన్న ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లపై దృషి పెట్టలేదు. గత వానాకాలం సీజన్‌లో 74,393 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసింది. ఈసారి 81,933 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మిల్లర్లు మాత్రం 3,60,208 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొంటారని అంచనా వేసింది. అయితే.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే ఆరబెట్టడం వంటి సమస్యలతో రైతులు మిల్లులవైపే వెళ్తున్నారు.
ఫ ఇప్పటికే సన్న ధాన్యాన్ని జోరుగా కొంటున్న మిల్లర్లు
ఫ గతేడాది ప్రభుత్వం కొన్న సన్న ధాన్యం 74,393 మెట్రిక్ టన్నులు
ఫ ఈసారి 81,933 మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యం
ఫ ఇలాగైతే ప్రజా పంపిణీకి సరిపోయేలా సన్న బియ్యం అందుతాయా?
యాసంగిలో ధాన్యం దిగుబడి
అంచనా వివరాలు
(లక్షల మెట్రిక్ టన్నుల్లో)
దిగుబడి అంచనా 12.14
మార్కెట్‌కు వచ్చేది 11.26
దొడ్డు దాన్యం 6.84
సన్న ధాన్యం 4.42
మిల్లర్లు కొనేది 5.68
కేంద్రాలకు వచ్చేది 5.57
కొనుగోలు కేంద్రాలు 375


