మంత్రి కోమటిరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
నల్లగొండ : రంజాన్ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం.. ఉపవాసం, ప్రార్థన, దానం, సేవా స్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. రంజాన్ పండుగను క్రమశిక్షణతో, ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
సోమవారం రంజాన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి నల్లగొండకు రానున్నారు. నల్లగొండలోని ఈద్గాను సందర్శించి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపనున్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.
అర్చకుడికి ఉగాది పురస్కారం
కనగల్: దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందజేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య, కమిషనర్ శ్రీధర్ చేతుల మీదుగా మల్లాచారి పురస్కారం అందుకున్నారు.
నృసింహుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చన జరిపించారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
మంత్రి కోమటిరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు


