తెలంగాణలో చోరీ.. ఆంధ్రాలో అమ్మకం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణలో చోరీ.. ఆంధ్రాలో అమ్మకం

Apr 1 2025 11:18 AM | Updated on Apr 1 2025 1:24 PM

త్రిపురారం : పగలు గ్రామాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో ట్రాక్టర్లు, ట్రాలీలు, కల్టివేటర్లు, వీల్స్‌ దొంగిలించి తెలంగాణ రాష్ట్రం దాటించి ఆంధ్రప్రదేశ్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న నలుగురు దొంగల ముఠాను త్రిపురారం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం త్రిపురారం పోలీస్‌ స్టేషన్‌లో హాలియా సీఐ జనార్దన్‌గౌడ్‌, ఎస్‌ఐ వై.ప్రసాద్‌తో కలిసి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు వివరాలు వెల్లడించారు. నిడమనూరు, త్రిపురారం మండలాల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ పరికరాల దొంగతనాలు పెరగడంతో ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఆదేశానుసారం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఆదివారం త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వేముల నాగరాజు తన స్వరాజ్‌ ట్రాక్టర్‌పై కల్టివేటర్‌, ఆఫ్‌ వీల్స్‌, ట్రాక్టర్‌ గొర్రు వేసుకుని వస్తున్నాడు. ట్రాక్టర్‌ ముందు పల్సర్‌ బైక్‌పై పాల్తి తండాకు చెందిన డేగావత్‌ బాబునాయక్‌, ట్రాక్టర్‌ వెనకాల తిప్పర్తి మండలంలోని రామారం గ్రామానికి చెందిన ఎరకల శివ, బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన గద్దల రాజీవ్‌ పల్సర్‌ బైక్‌పై వెళ్తున్నారు. త్రిపురారం ఎస్‌ఐ ప్రసాద్‌కు అనుమానం వచ్చి వారిని ఆపి విచారించడంతో వ్యవసాయ పరికరాలు దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. అంజనపల్లి గ్రామానికి చెందిన వేముల నాగరాజు పాల్తితండాకు చెందిన డేగావత్‌ బాబునాయక్‌, ఎరకల శివ, గద్దల రాజీవ్‌, బొంత శంకర్‌, ఓగ్గు నవీన్‌ల సహకారంతో దొంగతనాలకు పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. దొంగిలించిన వాహనాలు, వస్తువులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమ్మి వచ్చిన డబ్బులు నలుగురు పంచుకున్నట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. దొంగతనానికి గురైన ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసిన వారిని నుంచి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దొంగతనానికి గురైన సమయలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు ప్రకారం వారి వస్తువులను వారికి అప్పజెప్పనున్నారు. నిందితులను పట్టుకున్న హాలియా సీఐ జనార్దన్‌ గౌడ్‌ టీం త్రిపురారం ఎస్‌ఐ వై ప్రసాద్‌, పీసీఆర్‌ శ్రీనివాస్‌, పీసీఎస్‌ శ్రీను, హెచ్‌జీ చాంద్‌ పాష, హెచ్‌జీ నర్సింహ, పీసీలు నవీన్‌రెడ్డి, రాము, రాంబాబు, మణిరత్నం పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

‘సాక్షి’కి బాధితులు అభినందనలు

త్రిపురారం మండల వ్యాప్తంగా దొంగతనాలు పెరగడంతో ఈ నెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో త్రిపురారంలో దొంగల భయం అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎస్పీ మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు పర్యవేక్షణలో హాలియా సీఐ జనార్దన్‌ గౌడ్‌తో త్రిపురారం ఎస్‌ఐ వై ప్రసాద్‌ సిబ్బందితో ఓ టీం ఏర్పాటు చేశారు. వారు నలుగురు దొంగలను అరెస్ట్‌ చేసి దొంగతానికి గురైన వాహనాలు, పని ముట్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. త్రిపురారం మండలంలో జరుగుతున్న దొంగతనాలపై సాక్షి దినపత్రిక వెలుగులోకి తేవడంతో బాధితులు సాక్షి కి అభినందనలు తెలిపారు.

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

ట్రాక్టర్లు, ట్రాలీలు, కల్టివేటర్లు, వ్యవసాయ పరికరాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన

మిర్యాలగూడ డీఎస్పీ

రాజశేఖర రాజు

తెలంగాణలో చోరీ.. ఆంధ్రాలో అమ్మకం1
1/1

తెలంగాణలో చోరీ.. ఆంధ్రాలో అమ్మకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement