ఇరువర్గాల మధ్య ఘర్షణ, కేసులు నమోదు
హుజూర్‌నగర్ (చింతలపాలెం) : ఇద్దరు యువకులు మధ్య క్రికెట్ విషయంలో మొదలైన తగువు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గృహోపకరణాలు, మోటారు సైకిళ్లనుఽ ధ్వంసం చేసుకున్నారు. ఈ సంఘటన చింతలపాలెం మండలం కిష్టాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామానికి చెందిన యువకులు సుల్తాన్, జమాల్‌సైదా ఇద్దరు స్నేహితులు. క్రికెట్ విషయంలో ఇరువురి మధ్య తగవు జరిగింది. ఇది పెద్దలకు చేరడంతో వారు సర్దిచెప్పి పంపే క్రమంలో ఓ పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో గ్రామస్తుడు చప్రాసి సైదాకు గాయాలు కావడంతో ఇరువర్గాల వారు ఒకరి ఇళ్లపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురి ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, మంచాలు ధ్వంసమయ్యాయి. రెండు బైకులు పూర్తిగా.. మరో 3 బైకులు ఽస్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఇరువురికి బలంగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయాలైనవారిని కోదాడ, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో ఇరువర్గాలకు చెందిన దాదాపు 20 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపారు.


