డీజిల్ ట్యాంక్ లీకై రేంజ్ రోవర్ కారు దగ్ధం
నార్కట్‌పల్లి : రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్‌లు ముగ్గురు స్నేహితులు కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్ బంక్‌లో రేంజ్ రోవర్ కారుకు పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు సమీపంలోకి రాగానే రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంక్ లీకై చిన్నచిన్న మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న యువకులు గుర్తించారు. అప్రమత్తమైన ఆ యువకులు కారును రోడ్డు పక్కన నిలిపి కారులో నుంచి బయటకు వచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది ఎగిసిన పడుతున్న మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కారులో నుంచి సురక్షితంగా
బయటపడిన యువకులు


