బుద్ధవనాన్ని సిద్ధం చేయాలి
నల్లగొండ : బుద్ధపూర్ణిమ సందర్భంగా వచ్చే నెల 12న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నందున తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిస్‌వరల్డ్ పోటీదారుల రాక ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్, తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు మే 12న నాగార్జునసాగర్ బుద్ధవనానికి వస్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు విజయవిహార్, బుద్ధవనాల్లో వారు గడుపుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో చింతపల్లి వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. బుద్ధుడి ధ్యాన మందిరంలో ధ్యానంలో పాల్గొంటారని వారికి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాసులు ఉన్న వారిని తప్ప ఇతరులను బుద్ధవనంలోకి అనుమతించవద్దని సూచించారు. వారు విశ్రాంతి తీసుకునేందుకు విజయ్‌విహార్‌లోని రూమ్‌లను సిద్ధం చేయాలన్నారు. వారు తిరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో ప్రదేశం వద్ద ఒక సీఐ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, బుద్ధవనం ఆఫీసర్ మధుసూదన్‌రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.


