రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
హుజూర్‌నగర్ : రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్ 24న రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి రూ.15 వేలు లంచం అడిగాడని, వారిరువురి మధ్య రూ.10 వేలకు ఒప్పదం కుదిరిందని ఏసీబీ డీఎస్పీ తెలి పారు. మంగళవారం బాధితుడు చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అంతిరెడ్డికి రూ.10వేలు అందజేయగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని, విచారణ అనంతరం ఎస్సైని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ తెలిపారు.


