బైక్‌ను ఢీకొన్న ట్యాంకర్.. ఒకరు దుర్మరణం
చౌటుప్పల్ రూరల్: బైక్‌ను వెనుక నుంచి కెమికల్ ట్యాంకర్ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన వెల్గ నర్సిరెడ్డి(48) సంస్థాన్ నారయణపురం మండలం మల్లారెడ్డిగూడెంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.


