ఆరేళ్లు.. 43,314 డెలివరీలు
మెరుగైన వైద్యం అందుతుంది
ప్రభుత్వ ఆస్పత్రుల మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది. పీహెచ్‌సీ స్థాయిలోనే గర్భిణుల నమోదు చేసి వారిని రెగ్యులర్‌గా చెకప్‌కు తీసుకుపోతున్నారు. డెలివరీ అయ్యేంత వరకు ఆశ వర్కర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు గణనీయంగా పెరుగుతున్నాయి.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్,
డీఎంహెచ్‌ఓ, నల్లగొండ
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో ప్రసవాలు
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో ప్రభుత్వ ఆస్పత్రుల వైపు వచ్చేందుకు జంకే మహిళలు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రల్లో డెలివరీలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో రికార్డు స్థాయిలో డెలివరీలు జరుతున్నాయి. ఆరేళ్లుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 71,737 డెలివరీలు జరగ్గా.. ఒక్క ఎంసీహెచ్‌లోనే 43,314 ప్రసవాలు జరిగాయి. మిగిలిన అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 31,829 డెలివరీలు మాత్రమే జరిగాయి.
మెరుగైన వసతులు
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రి ఉండడంతో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. దాంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ క్లిట్లను అందించి ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను తల్లి బ్యాంక్ ఖాతాలో జమచేసింది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చే సమయంలో, డెలివరీ తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమయంతో ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటికి చేర్చుతున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది.
నమోదు నుంచి ప్రసవం వరకు పర్యవేక్షణ
గర్భం దాల్చిన మూడవ నెలలోనే ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు వారి ఇంటి వద్దనే గర్భిణుల పేర్లను ప్రత్యేక ఫొర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆ తరువాత ప్రతి చెకప్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లడంతోపాటు టీకాలు కూడా సరైన సమయంలో వేయిస్తున్నారు. డెలివరీల కోసం పీహెచ్‌సీలకు, ఏరియా ఆస్పత్రులకు తీసుకుపోతున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే అక్కడి వైద్యులు జీజీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి పరిస్థితి, ఆమెకు అందాల్సిన వైద్యం వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ యాప్‌లో డాక్టర్లు అప్‌లోడ్ చేస్తున్నారు. జీజీహెచ్‌లో ఉండే వైద్యులు గర్భిణి ఆస్పత్రికి చేరేలోపు అప్రమత్తమై ఆమెకు అందిచాల్సిన చికిత్సకు సిద్ధంగా ఉండి డెలివరీ చేస్తున్నారు. ఇక్కడ కూడా డెలివరీ కాని పరిస్థితి ఉంటే వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ తదితర ఆస్పత్రులకు రెఫర్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎంసీహెచ్ యాప్‌లో ఆప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో అక్కడి ఎంసీహెచ్ నోడల్ అధికారి వైద్యులను అప్రమత్తం చేసి సకాలంలో వైద్య అందించి డెలివరీలు చేస్తున్నారు. దీంతో మాతాశిశు మరణాలు తగ్గుతున్నాయి. ఇలా అంతా సవ్యంగా సాగుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చేయించుకోవడానికి గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు.
ఎంసీహెచ్‌లో డెలివరీలు ఇలా..
సంవత్సరం ప్రసవాలు
2019–20 7,190
2020–21 7,4843.
2021–22 7,546
2022–23 7,639
2023–24 7,140
2024–25 6,315
మొత్తం 43,314


