
ఇసుక అక్రమ రవాణా కానివ్వం
మిర్యాలగూడ : ఇసుక అక్రమంగా రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ‘ఆగని ఇసుక దందా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఇసుక అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా గనులు, భూగర్భజలశాఖ సహాయ సంచాలకుడు జాకోబ్‌ను సోమవారం ఉదయం ఆదేశించారు. ఆయన వెంటనే విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. అధికారి సమర్పించిన నివేదిక ప్రకారం.. మూసీ, పాలేరు వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా కావడం లేదని, కేవలం రావులపెంట, బొమ్మకల్ నుంచి అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే ఇసుకను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వంగమర్తి ఇసుక రీచ్ వద్ద అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేశామని.. అక్కడి నుంచి వచ్చే ప్రతి ఇసుక వాహనాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వంగమర్తి ఇసుక రీచ్ నుంచి కేవలం అనుమతించిన వాహనాలు వెళ్తున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ఓవర్ లోడ్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. వైటీపీఎస్, కేఎన్‌ఆర్ సంస్థ పనులకు అనుమతులు ఉన్న ఇసుక మాత్రమే వెళ్తుందని తెలిపారు. సవరించిన ధరల ప్రకారం ట్రాక్టర్ ఇసుక రూ.4800కు అందుబాటులో ఉంచామని వివరించారు. గడిచిన రెండు రోజుల్లో ఇసుక వాహనం ద్వారా సుమారు 150 ట్రిప్పులను డెలివరీ చేశామని.. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న మరో 300 ట్రిప్పులను రెండు రోజుల్లో డెలివరీ చేయడం చేస్తామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకుగాను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ తదితర శాఖల ద్వారా పూర్తి స్థాయిలో తనిఖీకి సిబ్బంది ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒకవేళా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.50 వేల వరకు జరిమానా విధించడంతోపాటు కోర్టుకు అప్పగిస్తామని హెచ్చరించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి