
ట్యాబ్లెట్‌కు రంధ్రాలు పడి పొడి రాలిన దృశ్యం
పాములపాడు: రోగాలను నయం చేసే మందుల్లో పురుగులు పడిన ఘటన ఆత్మకూరు పట్టణంలో వెలుగుచూసింది. మండలంలోని జూటూరు గ్రామానికి చెందిన భాస్కర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 22న భార్య విజయలక్ష్మికి అనారోగ్యంగా ఉండటంతో ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి నాలుగు రకాల మందులు రాసిచ్చారు.
అక్కడే ఉన్న తరుణ్ తేజ్ మందుల దుకాణంలో వీటిని కొనుగోలు చేశారు. అయితే బుధవారం ఉదయం ట్యాబ్లెట్ వేసుకునేందుకు షీట్ ఓపెన్ చేయగా Axeduracv 500 ట్యాబ్లెట్‌కు రంధ్రాలు పడి పురుగులు బయటకు రావడంతో ఆందోళనకు లోనయ్యారు. ట్యాబ్లెట్ల తయారీ తేది ఫిబ్రవరి 2023 కాగా.. ఎక్స్‌పైరీ గడువు జులై 2024 వరకు ఉంది. అయినప్పటికీ ఇలా జరగడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై మాయలూరు ఫార్మసిస్టు సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే కారణమన్నారు. ముడి పదార్థం నాసిరకం కావడంతోనే ఇలా జరిగి ఉంటుందన్నారు. ప్యాకింగ్ సరిగా లేకపోయినా పురుగులు అందులో చేరుతాయన్నారు. పురుగులు తప్పనిసరిగా చనిపోవాలని, అలా జరగలేదంటే ట్యాబ్లెట్ నాసిరకం అనే విషయం అర్థమవుతుందన్నారు. ఈ కంపెనీ కూడా చెప్పుకోదగ్గది కాదన్నారు.