
ఆ ఇద్దరే ... ఈ ఇద్దరా..!
ముమ్మర దర్యాప్తు చేస్తున్నాం
పది క్రితం దంపతులపై దాడి చేసిన నిందితులే నంద్యాల శివారులో యువకుడిపై దాడి చేశారా అన్న విషయం విచారణలో తెలుస్తుంది. పాణ్యం కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. కొందరు అనుమానితులను గుర్తించాం. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. రెండు, మూడు రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం.
– జావళి అల్ఫోన్స్, డీఎస్పీ, నంద్యాల
సాక్షి, నంద్యాల: జాతీయ రహదారుల వెంట దోపిడీ దొంగలు మాటు వేసి వాహనదారులను నిలుపు దోపిడీ చేస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. సొమ్ము దోచుకోవడంతో పాటు కత్తులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు మీదకే వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియక వాహనదారులు భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. జనవరి 19వ తేదీన రాత్రి కర్నూలు – నంద్యాల జాతీయ రహదారిలో శాంతిరామ్ ఆస్పత్రి సమీపంలో దోపిడి దొంగలు హల్‌చల్ చేశారు. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన దామరేకుల పెద్దన్న, జయమ్మ దంపతులు వారి కుమార్తెను ప్రసవం కోసం శాంతిరామ్ హాస్పిటల్ చేర్పించారు. జయమ్మ బహిర్భూమికి వెళ్లేందుకు భర్తను తోడు తీసుకుని హాస్పిటల్ సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దొంగలు వారిపై దాడి చేసి బంగారు చైన్‌ను లాక్కొని పరారయ్యారు. పెద్దన్నపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన మరిచిపోక ముందే జిల్లా కేంద్రంలోనూ అలాంటి ఘటనే పునరావృతమైంది. పది రోజుల్లోనే 28వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో నంద్యాల పట్టణానికి చెందిన ఓ ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి బంగారు చైన్, కొంత నగదు దోచుకున్నారు. కాగా ఈ రెండు ఘటనల్లో దాడులకు పాల్పడింది ఒకే ముఠా సభ్యులా అనే అనుమానం వ్యక్తమవుతోంది. బాధితుల వివరాల మేరకు దుండగులు హిందీ భాషలో మాట్లాడుతుండటం, విచక్షణా రహితంగా దాడులు చేయడం చూస్తే రెండు చోట్ల దుశ్చర్యకు పాల్పడింది వారేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పాణ్యం ఘటనతో మేల్కోని పోలీసులు
శాంతిరాం ఆసుపత్రి సమీపంలో దంపతులపై దాడి జరిగి రెండు వారాలవుతున్నా పోలీసులు ఈ కేసు దర్యాప్తులో పురోగతి సాధించలేదు. దీంతో నంద్యాల పట్టణ శివారులో రెండో ఘటన చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి శాంతిరామ్ హాస్పిటల్ కేవలం 15 కి.మీ దూరంలోనే ఉంది. ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్ కాలేజీలు ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికి తోడు కడప నుంచి హైదరాబాద్ మార్గంలో వాహనాలు వెళుతూనే ఉంటాయి. ఇంత రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కనే దుండగులు దోపిడీకి పాల్పడుతుండటంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైవేలను అడ్డాగా చేసుకుంటున్న
దొంగలు
దాడి చేసి నిలువు దోపిడీ చేస్తున్న ముఠా
పది రోజుల్లో రెండు ఘటనలు
దోపిడీకి పాల్పడేది ఒకే ముఠాగా
అనుమానం
Comments
Please login to add a commentAdd a comment