అనారోగ్యంపాలు | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంపాలు

Published Fri, Feb 21 2025 8:23 AM | Last Updated on Fri, Feb 21 2025 1:43 PM

-

కలకలం రేపుతున్న పాల కల్తీ

గత ఏడాది 12 శాంపిల్స్‌లో ఐదింట నిర్ధారణ

చిక్కదనం, వెన్న శాతం పెంపునకు అడ్డదారులు

డిమాండ్‌కు తగినట్లుగా లేని పాల ఉత్పత్తి

కొరతను అధిగమించేందుకు కల్తీ చేస్తున్న వ్యాపారులు

ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం

అనంతపురం జిల్లాలో పాల కల్తీ వ్యవహారం ఆ ప్రాంతాన్నే కాదు మొత్తం రాష్ట్రంలో కలకలం రేపింది. తాగుతున్న పాలు స్వచ్ఛమైనవేనా అనే సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. గ్రామాల్లో పశువులు గణనీయంగా తగ్గిపోవడంతో పాల ఉత్పత్తి కూడా అదే స్థాయిలో పడిపోతోంది. ఈ నేపథ్యంలో ప్యాకెట్ పాలు మార్కెట్ ను ముంచెత్తుతుండటంతో కల్తీ అధికమైంది. పాలు చిక్కగా ఉండేందుకు.. వెన్న శాతం పెరిగేందుకు అనారోగ్యకరమైన పద్ధతులు తెరపైకి వస్తుండటంతో అందోళన కలిగిస్తోంది.

ఉమ్మడి జిల్లా జనాభా: 50లక్షల పైనే

అవసరమైన పాలు: 16లక్షల లీటర్లు

జిల్లాలో ఉత్పత్తి: 10,82,950 లీటర్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో 2,16,590 పశువుల నుంచి రోజు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆవులు, బర్రెలు రోజుకు సగటున 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఈ ప్రకారం రోజుకు 10.82 లక్షల లీటర్లు మాత్రమే పాల ఉత్పత్తి ఉంటోంది. దీన్ని బట్టి చూస్తే రోజుకు 5.17 లక్షల లీటర్ల పాల కొరత ఉందన్నది వాస్తవం. ఈ కొరతను అధిగమించేందుకు కొన్ని డెయిరీలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఉన్న పాలనే కల్తీ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని డెయిరీలు పాలు ఎక్కువగా ఉన్నప్పుడు పాలను పొడిగా తయారు చేసుకుంటాయి. కొరత ఉన్నప్పుడు పొడిని ఉపయోగించి పాలుగా మార్పు చేసి కొరతను అధిగమిస్తున్నారు. పాలు ఉత్పత్తి చేసే నిజమైన రైతు లీటరు మీద పొందుతున్న లాభం రెండు, మూడు రూపాయలే. వీటిని కొంటున్న వ్యాపారులు కొందరు కల్తీ చేయడం ద్వారా లీటరుకు రూ.10పైగా లాభం పొందుతున్నారు. పశువుల సంఖ్య పడిపోవడంతో డిమాండ్‌కు తగ్గట్టుగా పాల ఉత్పత్తి కరువైంది. కల్తీ చేయడం ద్వారానే డిమాండ్‌కు తగ్గట్టుగా పాలు మార్కెట్‌లో లభిస్తున్నాయని తెలుస్తోంది. కల్తీ పాలు తాగుతుండటం వల్లే అధిక శాతం ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాగుతున్న పాలు స్వచ్ఛమైనవేనా?

జిల్లాలో విజయ పాలు, పలు ప్రయివేటు డెయిరీల పాల విక్రయాలు చేపడుతున్నాయి. కొంత మంది రైతుల నుంచి పాలు సేకరించి వాటిని కల్తీ చేసి ఇటు డెయిరీలకు, అటు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో జరుగుతున్న పాల కల్తీ ఉలిక్కిపడేలా చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా వివిధ రూపాల్లో పాలు కల్తీ అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. పాలల్లో నీరు కలిపి కల్తీ చేయడం కొత్తేమీ కాదు. అయితే కొంత మంది వ్యాపారులు, దళారీలు ఎక్కువ లాభం పొందేందుకు పాలల్లో నీళ్లే కాకుండా అనేక రసాయనాలను కలుపుతున్నట్లు సమాచారం. కెమికల్స్‌తో పాల నాణ్యత పరిమాణాన్ని కృత్రిమంగా పెంచేస్తున్నారు. నీళ్లు, డిటర్జెంటు, మొక్కజొన్న పిండి, యూరియా, పొద్దుతిరుగుడు నూనె వంటి వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఫార్మాలిన్‌ లేదా బోరిక్‌ యాసిడ్‌, చిక్కగా ఉండటానికి క్లోరిన్‌, అమ్మోనియా సల్ఫేటు కలుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కాస్టిక్‌ సోడా, బెంజాయిక్‌ యూసిడ్‌, సాలిసిలిక్‌ యాసిడ్‌ కలుపుతున్నట్లు సమాచారం.

గత ఏడాది ఐదు కల్తీ కేసులు

2024లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి 12 శాంపుల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఐదింట్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇవన్నీ మార్కెట్‌లోకి వెళ్లిపోయాయి. కల్తీతో ప్రజారో గ్యం ఏ స్థాయిలో దెబ్బతింటుందో ఊహించుకోవచ్చు. 2024లో కర్నూలులో మార్కెట్‌ షేర్‌ ఎక్కువగా ఉన్న డెయిరీ దూద్‌పేడాలో కల్తీ జరిగినట్లు తేలింది. పాలు, కలాకాన్‌, నెయ్యి వంటి వాటిల్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ కావడం గమనార్హం. కల్తీపై జేసీ కోర్టులో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు.

అనంతపురం జిల్లాలో వెలుగుచూసిన కల్తీ ఇలా..

కొంతమేర మాల్తోటెస్టిన్‌ పౌడర్‌, పామాయిల్‌ 250/500 ఎంఎల్‌, లీటరు పలుచని పాలు, ఉప్పు తీసుకొని మిక్సీకి వేస్తారు. ఇలా చేయడం వల్ల చిక్కటి లిక్విడ్‌ వస్తుంది.

దీనిని ప్రతి 20 లీటర్ల పాలకు అర్ధలీటరు లిక్విడ్‌ను కలిపి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు.

ఇందువల్ల పాలు చిక్కగా ఉంటాయి. వెన్న శాతం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ కల్తీని లాక్టోమీటరు కూడా గుర్తించలేకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement