భృంగి వాహనాధీశా.. పాహిమాం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో శ్రీగిరి క్షేత్రం ఇల కైలాసాన్ని తలపిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై దర్శనమిచ్చారు. భక్తుల శివన్మామస్మరణ, కళాకారుల సందడితో పరమేశ్వరుడి పరమభక్తుడైన భృంగి పులకించిపోయారు. వేలాది మంది భక్తులు భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల దివ్యమంగళస్వరూపాన్ని దర్శించి దీవెనలిమ్మని వేడుకున్నారు. ఉత్సవంలో ముందుగా భృంగి వాహనాన్ని వివిధ సుగంధ పుష్పాలతో అలంకరించారు. అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణతో ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను గ్రామోత్సవాన్ని దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు ప్రారంభించారు. పరివార దేవతామూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఉత్సవాన్ని ఆలయం బయటకు తీసుకొచ్చారు. ఉత్సవం ముందు పలువురు కళాకారుల నృత్యాలు, కోలాటం, నాదస్వరం, చెక్కభజనలు, రాజభటుల వేషధారణలు, కేరళ చండీమేళం, కొమ్ము కొయ్యనృత్యం, డప్పుల నృత్యాలు, బుట్టబొమ్మలు, నందికొలసేవ భక్తులను అలరించాయి. గ్రామోత్సవం గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శోభాయమానంగా సాగింది.
శ్రీశైలంలో నేడు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
శ్రీగిరిలో వైభవంగా మహాశివరాత్రి
బ్రహ్మోత్సవాలు
స్వామిఅమ్మవార్లను దర్శించుకుని
తరించిన భక్తజనం
ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
భృంగి వాహనాధీశా.. పాహిమాం
Comments
Please login to add a commentAdd a comment