
అహోబిలం.. భక్తిపారవశ్యం
● శాస్త్రోక్తంగా స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీ ప్రహ్లాదవరదస్వామి జన్మనక్షత్రమైన ‘స్వాతి’ని పురస్కరించుకుని సోమవారం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందా నామస్మరణతో భక్తులు ప్రణమిల్లారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను, అమృతవల్లీ అమ్మవార్లను దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణ చేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో ఉత్సవాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి పల్లకీలో ఉత్సవమూర్తులు మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
బైర్లూటి దర్గాలో వడగండ్ల వాన
ఆత్మకూరు: బైర్లూటి దర్గాలో సోమవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దర్గాలోని సేమియాలు గాలులకు ఎగిసిపడ్డాయి. మండలంలోని వెంకటాపురం, ఎస్.ఎన్.తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే ఆత్మకూరులో ఒక్క చినుకు కూడా పడలేదు. నల్లమల అటవీ పరిధిలోని బైర్లూటీ నుంచి రోళ్లపెంట వరకు వర్షం కురిసింది.
శాస్త్రోక్తంగా పల్లకీసేవ
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి దంపతులకు సోమవారం రాత్రి పల్లకీసేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ దేవిక ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, హనుమంతుశర్మ, అర్చకులు శరభయ్యశర్మలు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాకారాల్లో స్వామి, అమ్మవారి పల్లకీసేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
చిరస్మరణీయుడు అంబేడ్కర్
● రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయుడని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అన్నారు. బొమ్మలసత్రం బ్రిడ్జి కింద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దళితుల హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్ చిరస్మరణీయులన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. దేశానికి దశ, దిశ ఏర్పాటు చేసిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని కొనియాడారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మాబూన్నిసా, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అహోబిలం.. భక్తిపారవశ్యం

అహోబిలం.. భక్తిపారవశ్యం

అహోబిలం.. భక్తిపారవశ్యం