
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరై తొలివిడత బేస్‌మెంట్ లెవల్ పూర్తి చేసుకున్న వారికి బుధవారం సాయంత్రం వరకు మొదటి విడత రూ.లక్ష వారి ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన 3500 ఇళ్లకుగాను అర్హత కలిగిన వారినే ఎంపిక చేయాలని తేల్చి చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ఇంటిని, పై కప్పును పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక చేయాలని ఆమె ఆదేశించారు. హైదరాబాద్, లేదా వేరే ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని ఎంపిక చేయవద్దన్నారు. ఎలిజిబుల్ విత్ ల్యాండ్ ప్రకారమే ఎంపిక ఉండాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ నెల 21 వరకు దరఖాస్తుల జాబితా ఎంపీడీవోలకు చేరుతుందని, ఈ నెల 30 వరకు ఇచ్చిన కోటాకు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఎంపిక చేయాలని ఆమె సూచించారు. మే 2న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అర్హుల జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు ఎవరో ఫోన్ చేశారని, అనర్హులను పథకానికి ఎంపిక చేసినా గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు వస్తాయని, ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అర్హుల ఎంపిక పగడ్బందీగా, పారదర్శకంగా చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ హౌసింగ్ పీడీ శంకర్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలి
మద్దూరు: మద్దూరులో పీఎసీఎస్ ఆధ్వర్యంలో, పల్లెగడ్డ తండాలోని ఐకేపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్‌షేలం బుధవారం తనిఖీ చేశారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేశారని ఆరా తీస్తూ.. తేమ శాతం, రికార్డులను పరిశీలించారు. రైతులకు సకాలంలో డబ్బులు పడేలా చూడాలని, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకలు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు ఖాజీపూర్‌లో మంత్రి పొంగులేటి పర్యటన
మద్దూరు: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం మండలంలో పర్యటించనుండగా.. ఈమేరకు ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తేగా.. మద్దూరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈమేరకు మండలంలోని ఖాజీపూర్‌లో నిర్వహించే రెవెన్యూ అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఈమేరకు బుధవారం కలెక్టర్‌తోపాటు అడిషనల్ కలెక్టర్ బేన్ షేలం, ఆర్డీఓ రాంచందర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామంలో భూ సమస్యలపై తహసీల్దార్ మహేష్‌గౌడ్‌ను అడిగి తెలసుకున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా చేయాల్సిన పనులు, రెవెన్యూ సదస్సుపై కింది స్థాయి అధికారులతో చర్చించారు. మంత్రి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా ఉదయం 9 గంటలకు ఖాజీపూర్ చేరుకుంటారని, గ్రామంలోని పాఠశాల ఆవరణలో రెవెన్యూ సదస్సును ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
కలెక్టర్ సిక్తా పట్నాయక్