
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా ముర్తాల్ లోని ప్రముఖ సుఖ్‌దేవ్ ధాబాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ హైవే మీద ఉన్న రెండు ధాబాల్లో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు దారి తీసింది. గత వారంలో కనీసం10,000 మంది సందర్శించి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్-స్ర్పెడర్ ధాబాలను సందర్శించిన వారినందరినీ గుర్తించడానికి భారీ కాంటాక్ట్-ట్రేసింగ్ పని జరుగుతోందని వారిని కనుగొనడం చాలా పెద్ద సవాలు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే 75 మంది ఉద్యోగులు కరోనావైరస్ బారిన పడటంతో సంబంధిత ధాబాలను అధికారులు సీజ్ చేశారు.
సుఖ్‌దేవ్ ధాబాలో 360 మంది ఉద్యోగుల నమూనాలను సేకరించగా, వారిలో 65 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని సోనెపట్ జిల్లా కమిషనర్ శ్యామ్ లాల్ పూనియా చెప్పారు. దీంతోపాటు నటుడు ధర్మేంద్ర యాజమాన్యంలోని గరంధరం ధాబాలో మరో 10 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. కరోనా నిబంధనల ప్రకారం హోటల్‌ను శానిటైజ్ చేయడంతోపాటు, పాజిటివ్ వచ్చినవారిని ఐసోలేషన్‌కు తరలించామన్నారు.
కాగా కరోనా వైరస్, లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఆంక్షలను సడలించిన తరువాత, ఆయా రాష్ట్రాలలో మధ్య ప్రయాణాలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలలుగా మూసి ఉన్న హైవే రెస్టారెంట్లు, ధాబాలు వద్ద కౌంటర్లలో జనం బారులు తీరారని, ఇది వైరస్ వ్యాప్తికి దారితీస్తోందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment