విదేశాలకు వెళ్లి, బాగా డబ్బు సంపాదించి, అక్కడే స్థిరపడాలని చాలామంది తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం సక్రమంగా ప్రయత్నాలు సాగించినవారు సాఫీగా విదేశాలకు వెళుతుంటారు. అయితే అక్రమ పద్దతుల్లో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నంచే వారు చిక్కుల్లో పడుతుంటారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో 24 ఏళ్ల యువకుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అరెస్టు చేసింది. ఈ కుర్రాడు 67 ఏళ్ల వ్యక్తి పాస్‌పోర్ట్‌పై కెనడా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బందికి అతనిపై అనుమానం వచ్చింది. దీంతో అతనిని విచారించగా అసలు విషయం వెల్లడయ్యింది. నకిలీ గుర్తింపుతో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని తేలింది.
సీఎస్‌ఐఎఫ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం టెర్మినల్-3 చెక్ ఇన్ ప్రాంతంలో అక్కడి సిబ్బంది అనుమానంతో ఒక వృద్ధుడిని విచారించగా, తాను 1957, ఫిబ్రవరి 10 న జన్మించానని, తన పేరు రష్విందర్ సింగ్ సహోటా అని అధికారులకు తెలిపాడు. ఎయిర్ కెనడా విమానంలో కెనడాకు వెళుతున్నట్లు తెలిపాడు. అయితే అధికారులు అతని పాస్‌పోర్ట్‌ను పరిశీలించగా దానిలోని వివరాలు, అతని రూపం భిన్నంగా ఉంది. అతను తన జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకున్నాడని విచారణ అధికారులు గుర్తించారు.
ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు చెకింగ్ పాయింట్‌కు తీసుకెళ్లారు. అక్కడ అధికారులు అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా 2000, జూన్ 10 న జన్మించిన గురు సేవక్ సింగ్ పేరుతో ఉన్న మరో పాస్‌పోర్ట్ సాఫ్ట్ కాపీని గుర్తించారు. దీంతో అతని అసలు పేరు గురు సేవక్ సింగ్ అని, అతని వయసు 24 ఏళ్లని తేలింది. తాను సహోటా పేరుతో ఉన్న పాస్‌పోర్ట్‌పై ప్రయాణించేందుకు ప్రయత్నించానని అంగీకరించాడు. విచారణ అనంతరం అధికారులు ఆ యువకుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment