కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు.
కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్‌టేకర్‌గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్‌మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది.
బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్‌లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది.
విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్‌ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment