సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొద్ది రోజులుగా కరోనా విజృంభణతో ఆసుత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆక్సిజన్ లభ్యత లేని కారణంగా కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలలోగా ఢిల్లీలోని వేర్వేరు ఆస్పత్రల్లో మొత్తంగా 44 ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఢిల్లీలో 44 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
రాబోయే నెలలోగా 44 ఆక్సిజన్ ప్లాంట్లను ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నామని, ఇందులో 8 ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి 8 ప్లాంట్లు సిద్ధంగా ఉంటాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 36 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపారు. వాటిలో 21 ప్లాంట్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోనుండగా, మిగిలిన 15 ప్లాంట్లు భారత్‌కు చెందిన సంస్థల నుంచి పొందనున్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లను వేర్వేరు ఆసుపత్రులలో ఏర్పాటుచేస్తారు. దీంతో ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ఇవి సహాయపడతాయి. అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సి ఉన్నందున బ్యాంకాక్ నుంచి 18 ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. థాయిలాండ్ నుంచి ఆక్సిజన్ తెచ్చేందుకు వైమానికదళానికి చెందిన విమానాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించామని, ఈ అంశంలో కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు.
మే 10 నాటికి మరో 1,200 ఐసీయూ పడకలు
5 రోజుల్లో దేశంలోని చాలా మంది పారిశ్రామిక వేత్తలకు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహాయం కోసం రాసిన లేఖలకు అద్భుతమైన స్పందన లభిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. వారిలో చాలామంది సహాయం చేస్తున్నారని, ఢిల్లీ ప్రభుత్వానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఐసీయూ పడకలను సిద్ధం చేస్తోంది. మంగళవారం ఉదయం కేజ్రీవాల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్రత్యేక కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కోవిడ్ కేర్ కేంద్రాన్ని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రి సమీపంలో నిర్మిస్తున్నారు. ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిని సందర్శించారు. ఎల్‌ఎన్‌జేపీ ముందు రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ పడకలను, జీటీబీ ఆస్పత్రి సమీపంలో 500 ఐసీయూ పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. రాధాస్వామి క్యాంపస్‌లో 200 ఐసీయూ పడకలు ఉన్నందున, మే 10 నాటికి ఢిల్లీలో 1,200 ఐసీయూ పడకలు అదనంగా ప్రజలకు సిద్ధంగా ఉంటాయయని సీఎం పేర్కొన్నారు.
70 టన్నుల ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రాక
ఢిల్లీ ఆస్పత్రుల మెడికల్ ఆక్సిజన్ అవసరాలు తీర్చేందుకు 70 టన్నుల ఆక్సిజన్‌తో నిండిన ‘ఆక్సిజన్’ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. ఇందులోని ఆక్సిజన్‌ను ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించేందుకు ఆక్సిజన్ ట్యాంకర్లను ఢిల్లీ సర్కార్ సిద్ధంచేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఆక్సిజన్‌ను ఢిల్లీకి తీసుకొచ్చారని రైల్వే మంత్రి పియూశ్ గోయల్ ట్వీట్ చేశారు.
మెడికల్ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఆస్పత్రులకు పోలీసు రక్షణ మధ్య ఆక్సిజన్ ట్యాంకర్ తరలింపు
Comments
Please login to add a commentAdd a comment