ఫరీదాబాద్: మనం వెళ్తున్న లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోతే ఏం చేస్తాం? ఒక్కసారిగా కంగారుపడతాం. కేకలు వేస్తాం. ఎప్పుడు బయటపడతామా అని క్షణక్షణం ఎదురుచూస్తాం. లిఫ్ట్ తలుపులు తెరుచుకుని క్షేమంగా బయటకువచ్చేదాకా ఆందోళన తగ్గదు. కానీ, హరియాణాలో లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఎనిమిదేళ్ల బాలుడు గర్విత్ ఏమాత్రం టెన్షన్ పడకుండా రెండు గంటలపాటు చక్కగా హోంవర్క్ పూర్తిచేసుకున్నాడు. మిస్టర్ కూల్ అనిపించుకున్నాడు.
హరియాణా రాష్ట్రం గ్రేటర్ ఫరీదాబాద్‌లోని సెక్టార్–86లో ఉన్న ఒమాక్సీ హైట్ సొసైటీ అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో గర్విత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు ట్యూషన్ కోసం అదే అపార్టుమెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌కు లిఫ్ట్‌లో బయలుదేరాడు. రెండో అంతస్తుకు చేరుకోగానే లిఫ్ట్ ఆగిపోయింది. కాసేపు ఎదురుచూసినా లిఫ్ట్ కదల్లేదు. ఇక చేసేదిలేక హోంవర్క్ చేసుకోవడం ప్రారంభించాడు.
గర్విత్ ఇంకా రాలేదంటూ ట్యూషన్ టీచర్ అతడి తండ్రి పవన్‌కు ఫోన్ చేసింది. దాంతో ఆందోళనకు గురైన పవన్ అపార్టుమెంట్ అంతటా గాలించడం మొదలుపెట్టాడు. రెండో అంతస్తుకు చేరుకొని బిగ్గరగా పిలవడంతో గర్విత్ స్పందించాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయానని బదులిచ్చాడు. రాత్రి 7 గంటలకు ఇతరుల సాయంతో లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరవగా, గర్విత్ నవ్వుతూ బయటకువచ్చాడు. హోంవర్క్ లిఫ్ట్‌లో పూర్తి చేసుకున్నానని చెప్పాడు. పిల్లాడి ధైర్యం చూసి అపార్టుమెంట్‌వాసులు ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment